ఏబీవీపై మళ్లీ సస్పెన్షన్ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
Published on: Wed Jun 29, 2022 7:49AM
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పని అనివార్య పరిస్థితుల్లో ఏబీవీని ఈ నెల 14న ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టులో నియమించింది.
అయితే రెండు వారాల్లోనే మళ్లీ సస్పెండ్ చేసింది. జగన్ కు నచ్చని అధికారి ఎంత ప్రాధాన్యత లేని పోస్టులోనైనా సరే ప్రభుత్వ సర్వీసులో ఉండటానికి వీల్లేదన్న అప్రకటిత నిబంధన అమలౌతున్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఏబీవీ సస్పెన్షన్ కు ప్రభుత్వం ఉత్తర్వులలో చెప్పిన కారణమేమిటంటే.. 1969 ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారని. ఆలిండియా సర్వీస్ రూల్స్ సబ్ రూల్ 3, రూల్ 3 ప్రకారం ఏబీవీని సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి సీఎస్ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏ అభియోగం ప్రకారం జగన్ సర్కార్ తనను సస్పెండ్ చేయడం చెల్లదని సుప్రీం కోర్టు విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చిందో ఇప్పుడు అదే అభియోగంపై జగన్ సర్కార్ ఆయనను మళ్లీ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వంలో ఐబీ అధిపతిగా ఉంటూ ఇజ్రాయెల్ నుంచి రక్షణ పరికరాల కొనుగోలుకు.. ప్రభుత్వ అనుమతి లేకుండా తన వాళ్లకు సంబంధించిన ఆకాశ్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు రూ.35 లక్షలు చెల్లించారనే అభియోగంపై జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసింది.
అదే నెల 18న ఏబీవీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తనను అన్యాయంగా దురుద్దేశ పూర్వకంగా కేసులో ఇరికించారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఏబీవీకి ఊరట లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. వెంకటేశ్వరరావు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 22న విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 8 నుంచే ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ జీత భత్యాలు చెల్లించాలని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఆయనకు ఈ నెల 14న పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఏబీవీ తనపై ఉన్న ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ మళ్లీ సస్పెండ్ చేసింది.


