హోదా లేదు.. కుర్చీ ఉంది.. జగన్ పై జాలా.. గౌరవమా?
Published on: Tue Mar 4, 2025 8:47AM
.webp)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది. ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి. వారి వారి స్థానాలు ఎక్కడ ఉన్నాయి. అన్న విషయంపై క్లారిటీ ఇస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాు సోమవారం ఎమ్మెల్యేల సీట్లను ఖరారు చేశారు. ఈ ఖరారు చేసే సమయంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ కు ముందు వరుసలో సీటు కేటాయించారు. ఇది జగన్ పై జాలా.. లేక హోదా లేకపోయినా సభలో ఉన్న ఏకైక విపక్షం కనుక ఇచ్చిన గౌరవమా అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరాతిఘోరంగా పరాజయం పాలైంది. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. వైసీపీ అధినేత జగన్ పులివెందుల నుంచి విజయం సాధించినా, తన పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా, ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్క లేదు. ఆ హోదా ఇవ్వాలంటూ జగన్, ఆయన పార్టీ సభ్యులు కోరుతున్నారు. ఇచ్చే వరకూ అసెంబ్లీకీ హాజరయ్యేది లేదని భీష్మిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిన జగన్ ఆ వెంటనే వెళ్లిపోయారు. మళ్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రోజున హాజరయ్యారు. సరిగ్గా 11 నిముషాలు సభలో ఉండి, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి తన సభ్యులతో సహా వాకౌట్ చేశారు. ఆ తరువాత ఇక విపక్ష హోదా ఇస్తే తప్ప సభకు హాజరయ్యే ప్రశక్తే లేదని ప్రకటించేశారు. గవర్నర్ ప్రసంగం రోజున కూడా హాజరు కాకుండా అనర్హత వేటు భయంతోనే హాజరై.. హాజరు వేయించుకుని వెళ్లిపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
అటువంటి జగన్ కు రఘురామకృష్ణం రాజు మొదటి వరుసలో స్థానం కేటాయించారు. శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు, సభ్యులు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలో సీట్లను ఖరారు చేసిన డిప్యూటీ స్పీకర్. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం లకు సాధారణంగా ట్రెజరీ బెంచ్ లో ఇచ్చే ముందు వరుస సీట్లను కేటాయించారు. అలాగే మంత్రులకు కూడా ముందు వరుసతో మొదలుపెట్టి సీట్లను కేటాయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సీట్లు దక్కాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో సీనియార్టీ ప్రకారం కింద నుంచి పైకి వెళ్లారు. సీఎం, మంత్రుల తర్వాత వెనుక వరుసల్లో ఎమ్మెల్యేల సీనియార్టీ అధారంగా సీట్లు దక్కాయి. అయితే ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత హోదా కోసం పేచీ పెడుతున్న జగన్ కు ముందు వరుసలో సీటు కేటాయించారు. విపక్ష ఎమ్మెల్యేలు కూర్చొనే వైపు ముందు వరుసలో జగన్ కు సీటు ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయినా ఆ కుర్చీ మాత్రం జగన్ కు ఇచ్చినట్లైంది. జాలి పడ్డారా, గౌరవించారా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.


