విజయసాయిపై జ‘గన్’ఫైర్: పీకే సర్వేలే రీజన్!
Published on: Tue Apr 19, 2022 3:45PM
వైసీపీలో ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో? ఎప్పుడు ఎవరిని అధ:పాతాళానికి పడేస్తారో ఎవరి ఊహకూ అందదు. ఒకప్పుడు వైసీపీలో అంతా తానే అన్నట్లుగా విజయసాయి ప్రభ వెలిగింది. ఆ తరువాత ఏం జరిగిందో కానీ...క్రమంగా ఆయన ప్రభ పార్టీలో మసకబారుతూ వచ్చింది. పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించిన విజయ సాయి ఆ తరువాత ఉత్తరాంధ్ర ఇన్ చార్జి బాధ్యతలకే పరిమితం అయ్యారు. అంతలోనే ఏమైందో ఇప్పుడు ఆ నామమాత్రపు బాధ్యతల నుంచి కూడా తప్పించేసిన జగన్ విజయసాయిని ఉత్సవ విగ్రహ స్థాయికి తగ్గించేశారు.
విజయసాయి అధినేతకు అత్యంత ఆప్తుడిగా, విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఎటువంటి రాజకీయ అనుభవమూ లేకపోయినా...పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. అయితే ఇదంతా కొద్ది కాలమే...క్రమంగా విజయసాయి పార్టీలో కీలక స్థానం నుంచి ఒక్కో మెట్టూ దింపేస్తూ వచ్చిన జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జి పదవికి పరిమితం చేశారు. ఇప్పుడు ఆ పదవిని కూడా ఊడబీకేయడంతో ఇక వైకాపాలో విజయసాయి పాత్ర నామమాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తాజాగా వెల్లడించిన జిల్లా ఇన్ చార్జిల జాబితాలో విజయసాయి పేరు గల్లంతైంది. పార్టీ కేంద్రకార్యాలయానికి రమ్మని పిలిచారని అంటున్నప్పటికీ ..అక్కడ కూడా ఆయనకు క్రియాశీలంగా పని చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయి రెడ్డి పనితీరు వల్ల అక్కడ పార్టీకి నష్టం జరగిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే తాజా ఇన్ చార్జీల జాబితాలో పార్టీలో మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు కూడా గల్లంతయ్యాయి. వారు కూడా తక్కువ వారేం కాదు. పార్టీ రాజకీయ సలహాదారుగా ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరైతే...మరొకరు సాక్షాత్తూ జగన్ బంధువు, ప్రస్తుతం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
ముఖ్యంగా విజయసాయిరెడ్డిపై జగన్ ఆగ్రహానికీ అసంతృప్తికీ కారణాలేమిటన్న ప్రశ్నకు....క్యాడర్ లో విజయసాయి రెడ్డికి ఉన్న గుర్తింపేనన్న సమాధానం వస్తుంది. తన తరువాత తనంతటి వాడిగా విజయసాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే జగన్ ఆయనను కేవలం ఉత్తరాంధ్రకు పరిమితం చేశారనీ, అయితే అక్కడా ఆయన తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యం అధినేత ఆకాంక్షల మేరకు పార్టీని నడిపించేలా పని చేయలేదన్న భావనకు జగన్ రావడమేనని అంటున్నారు.
వీటికి తోడు 2019 ఎన్నికలలో జగన్ విజయానికి వ్యూహరచన చేసి విజయవంతంగా అమలు చేసిన ప్రశాంత్ కిషోర్ 2024లో కూడా ఏపీలో మరోసారి జగన్ పార్టీని గెలిపించేందుకు పని చేయనున్నారు. ఆయన చేసిన సర్వేలు, వాటి ఫలితాల ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనీ...అందులో భాగమే విజయ సాయి రెడ్డి ప్రాధాన్యాన్ని కుదించేయడం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయికి మరో మారు రాజ్యసభ అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా దాదాపు మృగ్యమనే అంటున్నారు.
మెత్తానికి వైసీపీలో విజయసాయి ప్రభ మసకబారడానికి ఎవరు ఏయే కారణాలు చెప్పినా జగన్ ఎవరినీ ఎక్కువ కాలం నమ్మరన్నదే వాస్తవం.
జిల్లాఇన్ చార్జీల లిస్టులో సజ్జల, వైవీ రెడ్డి పేర్లూ గల్లంతవ్వడమే ఇందుకు నిదర్శనం.


