TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం.. అందుకే ప్ర‌జ‌ల్లోకి నేత‌లు!

Published on: Wed Mar 16, 2022 12:00PM

జ‌గ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా చెప్పారు. ఇక ఉపేక్షించేదిలే అంటూ ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించారు. జూలై 8న, వైఎస్సార్ జ‌యంతి రోజున ప్లీన‌రీ నిర్వ‌హించి.. ఆ త‌ర్వాతే మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని బిస్కెట్ వేస్తూనే.. అదే టైమ్‌లో ఈసారి కొంద‌రికి ఎమ్మెల్యే టికెట్లు క‌ష్టం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ పాల‌న‌పై విర‌క్తితో, ఆగ్ర‌హంతో ఉంటే.. ఆయ‌నేమో ఆ సాకును ఎమ్మెల్యేల మీద‌కు నెట్టేస్తూ.. ఇక‌పై ప్ర‌జ‌ల్లో ఉండాలంటూ తేల్చి చెప్పారు. త‌ప్పు మీరు చేస్తే.. శిక్ష మాకా? అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ మండిప‌డుతున్నారు.

"మంత్రులంతా పార్టీ బాధ్య‌త‌లూ మోయాల్సిందే. త్వ‌ర‌లో మాజీల‌య్యే మంత్రులు నాలుగైదు జిల్లాల బాధ్య‌త‌లు తీసుకోవాల్సిందే." ఇదీ జ‌గ‌న్ ఆదేశం. "వచ్చే ఎన్నికల్లో మీరు గెలవడమే కాదు.. పార్టీని కూడా గెలిపించేలా జిల్లాలోని వైసీపీ అభ్యర్థులందరి విజయానికి కృషి చేయాలి. గెలువు-గెలిపించు అనే నినాదంతో మాజీ మంత్రులు పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకోవాలి". ఇవీ జగన్ సూచ‌న‌లు. అన్నీ ఎమ్మెల్యేలే చేస్తే.. మ‌రి జ‌గ‌న్‌రెడ్డి ఏం చేస్తారో? త‌మ‌రేమో అడ్డ‌గోలు విధానాల‌తో రాష్ట్రాన్ని అథోగ‌తి పాలు చేస్తే.. ఏపీని అప్పుల కుప్ప‌గా మారిస్తే.. ఇసుక‌, మైన్లు దోచుకుంటే.. రోడ్లు వేయ‌కుండా ప్ర‌జ‌ల న‌డ్డి విర‌గ్గొడుతుంటే.. క‌రెంట్ ఇవ్వ‌కుండా చీక‌టి పాల‌న చేస్తుంటే.. జ‌గ‌న్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత‌టి వ్య‌తిరేక‌త ఉంటే.. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి.. గెలుపు బాధ్య‌త‌లు తెలివిగా ఎమ్మెల్యేల మీద నెట్టేశార‌ని అంటున్నారు. 

ఎవ‌రైనా కాదూకూడ‌దు అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఉండ‌దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు జ‌గ‌న‌న్న‌. నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహిస్తామని.. గెలుస్తారని తేలిన వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. ఇక‌, జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యం ఎంత‌గా లేక‌పోతే.. ఎమ్మెల్యేలంతా వాలంటీర్ల‌తో క‌లిసి.. రాష్ట్రంలో ప్ర‌తీ గ‌డ‌ప‌కూ వెళ్లాల‌ని.. నెలకు పదిసార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని.. ప్ర‌జ‌ల‌తో మాట్లాడాల‌ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వివ‌రించాల‌ని.. వ‌చ్చే రెండేళ్లూ జ‌నంలోనే ఉండాల‌ని.. ఆదేశిస్తారు చెప్పండి? ప‌నిలో ప‌నిగా.. వైసీపీ బూత్‌ కమిటీలు వేసుకోవాలని.. గ్రామ, మండల, జిల్లా కమిటీలు పూర్తి కావాలని జగన్ తేల్చి చెప్పారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. జ‌గ‌న్‌లో ఓట‌మి క‌ల‌వ‌రం బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, రెండేళ్ల ముందుగానే ఇంటిని స‌ర్దుకునే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టేశారు. అయితే, చేయాల్సిన త‌ప్పులు, అక్ర‌మాలు, అరాచ‌కాల‌న్నీ జ‌గ‌న్ చేసేస్తూ.. గెలుపు బాధ్య‌త‌లు మాత్రం ఎమ్మెల్యేల మీద పెట్ట‌డం త‌గునా జ‌గ‌నా? అంటున్నారు.