TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ దెబ్బ.. బ్రదర్ అనిల్ అబ్బ..

Published on: Tue Mar 8, 2022 4:24PM

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమార్కుడు. ఈ చిత్రంలో హీరో రవితేజ.. తన మాస్.. మార్క్ హీరోయిజంతో విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు అత్తిలి చిరబరానంద స్వామిగా.. అందరికీ గుండ్లు కొట్టడం.. ఆ తర్వాత వారంతా.. ఎమ్మెల్యే వద్దకు తమ మోర వినిపించేందుకు వెళ్లడం.. అక్కడ.. ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారంటూ.. ఏమిటీ విషయం అంటూ ఎమ్మెల్యే భార్య అడగడం.. సదరు గుండు బాధితులంతా.. అత్తిలి చిరబరానంద స్వామి పేరు చెప్పడం.. దాంతో సదరు ఎమ్మెల్యే భార్య .. కన్నీటిపర్యంతమవుతూ.. మీ బాధ సరే.. నా బాధను ఎవరితో చెప్పుకొనంటూ.. తాను అత్తిలి చిరబరానంద స్వామిజీ బాధితురాలినే అనడం... ఈ నేపథ్యంలో సదరు గుండు బాధితులంతా.. ఆశ్చర్యానికి గురికావడం జరిగింది. ఇదంతా వెండి తెర మీద సీన్.. 

కానీ సరిగ్గా ఇలాంటి సీనే.. కానీ జస్ట్ ఛేంజ్.. అదీ పోలిటికల్ సీన్. ఫిబ్రవరి 7వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ బావ, వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలతోపాటు ముగ్గురు మహిళలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు. తాము పడుతున్న ఇబ్బందులను బ్రదర్ అనిల్‌ ఎదుట సదరు కులాల వారంతా  ఏకరువు పెట్టారట. ఆ క్రమంలో మీ బాధ సరే.. వైయస్ జగన్ తనకు సొంత బావై  ఉండి... రెండేళ్ల నుంచి తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చిందే లేదని ఆయన స్పష్టం చేయడంతో వారంతా కంగుతిన్నారని సమాచారం.  

అంతేకాకుండా.. వైయస్ జగన్ ప్రభుత్వం వల్ల తమకు ఒరిగింది ఏమీ లేదని, తమ కష్టాలను ఆయా సంఘాల ప్రతినిధులు బ్రదర్ అనిల్ కుమార్‌కు మోర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పాలనలోనే తాము ఎంతో ప్రయోజనం పొందారని వారు గుర్తు చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా.. దళితులు, బీసీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు, ముస్లింలపై గంజాయి రవాణా కేసులు నమోదు చేశారని వారు ఈ సందర్బంగా బ్రదర్ అనిల్ కుమార్‌కు వివరించారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా సమస్యపై ధర్నా చేస్తే.. ఈ అంశంపై ఆయన ఆరా తీసేవారని, సమస్యను వివరించడానికి ఆయన తమకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేవారని వారు ఈ సందర్భంగా గుర్త చేసుకున్నారట. అయితే ఈ జగన్‌ ప్రభుత్వంలో తమకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోగా, ధర్నాలు చేసే హక్కు నూ కూడా హరించారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముందస్తుగా ఆందోళనకు దిగిన తమను అరెస్టు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. భజన చేసే నాయకులకే సీఎం వైయస్ జగన్‌ అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని వారు అనిల్‌తో పేర్కొనడం కొసమెరుపు. కానీ పార్టీ విజయానికి కృషి చేసిన వారిని పక్కన పెట్టడం పట్ల వారు కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రచారం చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇదే విషయాన్ని ఆయనకు గుర్తుచేయగా.. బ్రదర్ అనిల్ నీళ్లు నమిలినట్లు సమాచారం. 
 
జగన్ పాలనలో క్రైస్తవులకు ప్రాధాన్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ విజయం కోసం గ్రామాల్లో తామంతా తిరిగామని వారు పేర్కొన్నారు. ఇప్పుడు తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని వారు వాపోయారు. జగన్‌ పాలనలో కంటే చంద్రబాబు ప్రభుత్వంలోనే క్రైస్తవులకు ఎక్కువ మేలు జరిగిందని పలువురు పాస్టర్లు ఈ సందర్భంగా బ్రదర్ అనిల్‌కు చెప్పినట్టు సమాచారం. పాస్టర్లకు ఒక నెల మాత్రమే రూ.5 వేలు గౌరవవేతనం ఇచ్చారని, ఆ తర్వాత మొండిచేయి చూపించారని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 

ఈ జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెబుతూ.. ఓ బీసీ సంఘం నేత అయితే జగన్‌ ఫ్యామిలీ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. ‘తల్లి, చెల్లి, మిమ్మల్ని (అనిల్‌ కుమార్‌) పట్టించుకోలేని నాయకుడు మమ్మల్ని ఎలా పట్టించుకుంటారంటూ బ్రదర్ అనిల్‌కు చురకలంటించినట్లు తెలుస్తోంది. దాంతో అనిల్‌ కుమార్ కాసేపు సైలెంట్‌గా ఉండిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత తేరుకున్న బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. నాకు అయితే సీఎం వైయస్ జగన్ రెండేళ్లకు పైగానే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేందంటూ తన మనసులోని మాటను బ్రదర్ అనిల్ కుమార్ బయట పెట్టారని విశ్వసనీయంగా తెలిసింది. 

మరో రెండు మూడు రోజుల్లో విశాఖ లేదా గుంటూరులో బ్రదర్ అనిల్ కుమార్ అధ్యక్షతన మరో సమావేశం ఉంటుందని సమాచారం. ఇటీవల రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్.. కొత్త రాజకీయ పార్టీ పెడతారంటూ.. ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. ఇదే విషయాన్ని విజయవాడలో బ్రదర్ అనిల్ కుమార్‌ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూనే..  కొన్ని రోజుల్లో ఓ శుభవార్త వింటారంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు బ్రదర్ అనిల్ భార్య వైయస్ షర్మిల.. మార్చి 11వ తేదీ నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం యాత్రను పున: ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.