ఏపీలో జగన్ ఔట్.. తేల్చేసిన ఈసీసీ సర్వే
Published on: Fri Jun 10, 2022 3:39PM
వచ్చిన అవకాశాన్ని రాజకీయాల్లో బాగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఎలాగో పీఠం ఎక్కించేసేరు. పోనీ పిల్లాడు ఏడుస్తున్నాడు ఓసారి అవకాశం ఇద్దామనుకున్నారు. పాలన సాగుతున్నకొద్దీ భజంత్రీల మాటలు, పాటలు బాగా వింటూ మహాద్భుతంగా సాగుతోంది, ఇక మన సీటు పర్మనెంట్ అనుకోవడం ఎంతో అమాయత్వం. ఎవ్వరూ అతిగా ఏమీ ప్రేమించరు. ముఖ్యంగా ఓటర్లు. సామాన్య జనానికి కావల సింది వారికి పాలకులు అనువుగా పథకాలు అమలుచేస్తున్నారా లేదా, వారి మాట వింటున్నారా లేదా అనే వుంటుంది.
ఎవరు ఎలాంటి తప్పిందాలను కప్పిపుచ్చుకోవాలన్నా వారికి తెలిసిపోతుంది. ఇక మరో సారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనా వారికి వుండదు. కానీ పీఠం మీద వున్నవారు అదే గర్వంతో కళ్లు మూసుకున్న పిల్లిలా వ్యవహరిస్తే ప్రమాదమే. మూడేళ్ల పాలన తర్వాత జగన్ ప్రభుత్వానికి అదుగో అలాంటి ప్రమాదమే వచ్చి పడింది. వార్తాహరులు, బాగా నమ్మినవారి సమాచారం కాస్త సంతోషపెట్టి వుండవచ్చుగానీ, అసలు సిసలు సర్వేలు అనేవి వుంటాయి. ఆ సర్వే సంస్థలకు బొత్తిగా మొహమాటం వుండదు. జగన్ ..మన సీఎం, వైసీపీ మన పార్టీ అంటూ ఏమీ ప్రత్యేకాభిమానం ఛస్తే వుండదు. కుండ బద్దలుకొట్టినట్టు జరిగేది చెబుతుంది. అదేదో సినిమాలో మాంత్రికుడి అద్భుత అద్దంలో లోకాన్ని చూపి నట్టు.. ఇటీవలి సర్వే జగన్‌గారి పాలనా ప్రభావం ఏ మేరకు తిరిగి పట్టంగడుతుంది అనేది స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది. ప్రజల మొగ్గు ఎటువైపు ఉంటుం ది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు? ప్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఇదే. అంతలా రాష్ట్రంలో రాజకీయ హీట్ పెరిగిపోయింది. ముందస్తు ఊహాగానాలతో ఎక్కడ నలుగురు కలిసినా రాష్ట్రంలో ఇదే చర్చ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన ఈఈసీ అనే సంస్థ ఏపీలో నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 20 మార్చి 5 మధ్య కాలంలో అత్యంత శాస్త్రీయం గా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ ర్యాండంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితం ఇప్పటికిప్పుడు ఎన్ని కలు జరిగితే తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఖాయమని తేల్చేసింది. ముందస్తు ఎన్నికల ప్రచా రం ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ కనీసంలో కనీసం 3.85 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకుని అధి కార పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే ఫలితం పేర్కొంది. వైసీపీకి గతంతో పోల్చుకుంటే ఓట్లూ, సీట్లూ కూడా గణనీయంగా తగ్గే అవకాశాలున్నయని తేల్చింది. ఇక జన సేప పార్టీ ప్రస్తత పరిస్థితుల్లో కనీసం ఒక సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదనీ, అయితే గతంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఓట్లు లభించే అవకాశాలున్నాయని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో అంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయల సీమ ప్రాంతాలలో ర్యాండమ్ గా 35 నియోజకవర్గాలలో ఈ సర్వే జరిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా లలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని, అలాగే రాయలసీమలో మాత్రం అధికార వైసీపీ స్వల్ప ఆధిక్యత కనబరి చిందని సర్వే ఫలితం తేల్చింది. ఉత్తర కోస్తాలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 7 నియోజకవర్గాలు, దక్షిణ కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 14 నియోజక వర్గాలలో, రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 14 నియోజకవర్గాలలోనూ ఈ సర్వే నిర్వహించింది.
కాగా సర్వేలో 43 శాతం మంది తెలుగుదేశంకు మొగ్గు చూపితే వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి శాతం 39.15, ఇక జనసేనకు 10.50 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీకి మద్దతుగా ఉన్న వారి శాతం కేవలం 1.28శాతం మాత్రమే. ఈ సర్వే ప్రకారం వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకి 3.85 శాతం ఆధిక్యత ఉందని సర్వే పేర్కొంది.
2019లో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామన భావిస్తున్న వారి శాతం 47.37శాతం ఉండగా, సరైన నిర్ణయమే తీసుకున్నా మన్న వారి శాతం 8.46గా ఉంది. ఏమో చెప్పలేం అన్న వారి శాతం 14.16గా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పని తీరుతో సంతృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నకు లేదని సమాధానం చెప్పిన వారి శాతం 31.62గా ఉండగా, సంతృప్తిగా ఉన్నామన్నవారు పాతిక శాతం మంది. ఫరవాలేదని చెప్పిన వారు 9.68 శాతం మంది. ఏ మాత్రం సంతృప్తిగా లేదన్న వారి శాతం 23.59 శాతం.
ఇక రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం బాగా పని చేస్తుందని భావిస్తున్న పార్టీ ఏదన్న ప్రశ్నకు 42 శాతం మంది తెలుగుదేశం పార్టీ అని సమాధానం ఇవ్వగా, 39 శాతం మంది వైసీపీ అని బదులిచ్చారు. జనసేన కు అనుకూలంగా 10.50 శాతం మంది, బీజేపీకి అనుకూలంగా 1.2 శాతం మంది బదులిచ్చారు.
భవిష్యత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరన్న ప్రశ్నకు 42.91 శాతం మంది చంద్రబాబుకు మద్దతు పలకగా, 39.09 శాతం మంది జగన్ కు అనుకూలాంగా ఉన్నారు. 10.54 శాతం మంది జనసేన నాయకుడు పవన్ పేరు చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేస్తారన్న ప్రశ్నకూ తెలుగుదేశం పార్టీకే అత్యధికులు అనుకూలంగా ఉన్నారని తేలింది. తెలుుగదేశం పార్టీకి అనుకూలంగా 43 శాతం మంది నిలవగా, వైసీపీకి మద్దతుగా 39.15 శాతం మంది ఉన్నారు. జనసేనకు 10.50శాతం మంది, బీజేపీకి 1.28 శాతం మంది మద్దతుగా నిలి చారు.
ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర కోస్తాలో 43.76 శాతంతో తెలుగుదేశం ప్రథమ స్థానంలో నిలవగా, వైసీపీ 38.28 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. 10.33 శాతం మద్దతుతో జనసేన 3వ స్థానంలో నిలవగా,బీజేపీ 2.14 శాతానికి పరిమితమైంది. సీఎంగా చంద్రబాబుకు 3.90 శాతం మంది మద్దతు పలికితే, జగన్ కు 38.33 శాతం మద్దతు లభించింది. జనసేనకు 10.19 శాతం, బీజేపీకి 2.23శాతం మద్దతు లభించింది.
దక్షిణ కోస్తా విషయానికి వస్తే.. ఏ పార్టీకి ఓటు వేస్తారన్న ప్రశ్నకుతెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపిన వారి సంఖ్య 44.64శాతం, వైసీసీకి 37.35శాతం, జనసేనకు 13,40 శాతం మంది మద్దతు తెలపగా, బీజేపీకి అను కూలంగా ఉన్న వారి శాతం కేవలం 0.73 శాతం. ముఖ్యమంత్రిగా ఎవరికి మీ మద్దతు అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా 44.69 శాతం మంది నిలవగా, జగన్ కు అనుకూలంా 37.33 శాతం మంది ఉన్నారు. పవన్ కు 13.42 శాతం మంది మద్దతు పలికారు.
రాయలసీమ విషయానికి వస్తే.. ఇక్కడ మాత్రం జగన్ కు, వైసీపీ పార్టీకి స్వల్ప మొగ్గు కనిపించింది.
ఏ పార్టీకి మీ ఓటు అన్న ప్రశ్నకు వైసీపీకి అనుకూలంగా చెప్పిన వారు 41.16 శాతం మంది ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వారు 40.76 శాతం ఉన్నారు. ముఖ్యమంత్రిగా మీ ఎంపిక ఎవరు అన్న ప్రశ్నకు జగన్ అని జవాబిచ్చిన వారు 41.31 శాతం మంది. చంద్రబాబుకు మద్దతుగా చెప్పిన వారు 40.76శాతం మంది. జనసేన అధినేత పేరు చెప్పిన వారు 7.83 శాతం మంది. మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనీసం 3.35 శాతం అధిక ఓటుతో తెలుగుదేశం విజయం సాధిస్తుందని ఈసీసీ సర్వే తేల్చింది.


