మరో విచారణ కమీషన్...బాబుని వదలని జగన్ !

 

ఎలా అయినా గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని నిరూపించాలని ప్రయత్నిస్తున్న జగన్ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తలనొప్పిగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తూ అభివృద్ధిని సైతం పక్కన పెట్టాడు. తాజాగా అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నారు. అదేంటంటే చంద్రబాబు హయాంలో ఉన్నత విద్యామండలిలో అక్రమాలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. 

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలవరం నిర్మాణం సహా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై క్యాబినెట్ కమిటీలని వేసిన ఆయన తాజాగా ఈ అస్త్రాన్ని సంధించారు. చంద్రబాబు హయాంలో ఉన్నత విద్యామండలిలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు లేవనెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని కమిషన్ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.