TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ స్థానిక సమరం: జగన్ సుద్దపూస కబుర్లు.. వినేవారెవరు.?

Published on: Tue Oct 20, 2026 11:54AM

​మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం గురించి గవర్నర్‌ను కలిసిన జగన్మోహన్ రెడ్డి, మీడియా ముందు వెళ్ళబుచ్చిన ఆవేదనలో   ప్రత్యేకత ఉన్నది. అరాచకాలకు సంబంధించిన వివరణలో ఆయన వర్ణన బాగుంటుంది. అది వివేకానందరెడ్డికి తగిలిన గొడ్డలి దెబ్బల గురించి అయినా, వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విధానం గురించి అయినా.. ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అరాచకాలను చేస్తుందేమో అనే ఊహతోనే ఆయన స్పష్టంగా  పిన్ టు పిన్ వర్ణిస్తారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న అనేకమంది రాజకీయ నాయకుల కంటే తెలివితేటలలో ఆరితేరారు.

వైసిపికి ​స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే అవకాశం ఇసుమంతైనా కనిపించటం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. తన హయాంలో తనకు అండగా నిలిచిన సహచరులు అరెస్ట్ అవుతున్నారు. కొత్త కేసులు ఎప్పుడు వచ్చి తన తలుపు తడతాయో తెలియని పరిస్థితి. పాత కేసులు రోజువారీ విచారణకు రానున్నాయి. వీటన్నిటి మధ్య ఎన్నికల సంరంభం. కార్పొరేషన్ మేయర్లను, మునిసిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నిక విధానంలో ఎన్నుకునే పద్ధతిని తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టారు.

మేయర్, మునిసిపల్ చైర్మన్లను గతంలో మాదిరిగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నుకునే విధానమే ఉంటే.. పోటీ చేయటానికి అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి ఉండేది కాదు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఒక ఆశ ఉండేది. తాము గెలిస్తే మేయర్ పదవి కోసం పార్టీల అధిష్టానాన్ని ఒప్పించుకోవచ్చు.  ఇప్పుడు ఆ ఆశ లేదు. గతంలో వారు తమ ఎన్నికకు అయ్యే ఖర్చు ఒక్కటి పెట్టుకుంటే సరిపోయేది. ఇప్పుడు మేయర్ అభ్యర్థికి మిగిలిన సభ్యులతో పని లేదు. మేయర్ అభ్యర్థి తనను తాను గెలిపించుకుంటే సరిపోతుంది.  అధికార పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రభుత్వంలో పనులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు అభ్యర్థుల కొరత కనిపించదు. అదే అధికారంలో లేని పార్టీ వారు అయితే చేయగలిగేది ఏమీ ఉండదు అనే నిర్లిప్తతతో పోటీ చేయటానికి వైసీపీ వైపుఎవరూ మొగ్గు చూపడం లేదు. 

​ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల పోరులో అధికార పక్షానిదీ, వైసీపీదీ ఒకటే దారి. వైసీపీని నామినేషన్లు వేయకుండా చూడాలని అధికార పార్టీ ఆలోచన.  2021 లో జరిగిన స్థానిక   పోరులో నామినేషన్లు వేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలనే బహిష్కరించింది అనటమే సబబు. ఆ రోజు కుప్పంలో కూడా నామినేషన్ వేయనీయని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను ప్రజల పరంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవటం వలన కుప్పం టార్గెట్ అయింది.  అందుకే తెలుగుదేశం పులివెందులను టార్గెట్ చేసింది. అది తెలుగుదేశం అధినాయకత్వం ఆదేశాల మేరకా..  లేక గతంలో తమను టార్గెట్ చేసిన వైసీపీ మీద అదే జులుం చేయాలని   కార్యకర్తల నిర్ణయమా? అంటే కార్యకర్తల నిర్ణయం అనే చెప్పాల్సి ఉంటుంది. అందుకే  జగన్ పోటీ చేసి ఓడిపోవటం కంటే, నామినేషన్లు వేయనీయలేదనే నెపంతో తప్పుకోవటం మంచిది అనే ఆలోచన చేసినట్లుగా కనిపిస్తున్నది.

​వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా చేసింది. తెలుగుదేశం ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఇలాంటి అరాచకాలకు పాల్పడలేదు. ఆ పార్టీ అధినేత అందుకు ఇసుమంతైనా అంగీకరించరు. ఆ విషయం ఆయన ప్రత్యర్థులకే కాదు.. తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు కూడా తెలుసు. అందుకే గతంలో అంటే వైసీపీ హయాంలో స్థానిక సమరం సమయంలో వైసీపీ ఎక్కడెక్కడ గూండాయిజం చేసిందో.. అక్కడే   సత్తా చూపించాలని ఎక్కడికక్కడ తెలుగుదేశం క్యాడర్, లీడర్ ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

 రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక నామినేషన్ల పర్వాన్ని గమనిస్తే, వైసీపీ హయాంలో జరిగినంత అరాచకం లేదనడం వాస్తవం. ఒకటి రెండు చోట్ల మరీ ముఖ్యంగా సీమలో వైసీపీ నామినేషన్లను అడ్డుకోవడం జ.రిగిందంటే.. అక్కడ ఆ పరిస్థితిని సృష్టించింది, అటువంటి అరాచకానికి నాంది పలికిందీ వైసీపీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పుంగనూరులో మిథున్ రెడ్డి తన వాహనంతో మొదలుపెట్టిన అరాచకం, రాయలసీమ నుండి ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు ఒక హింసాత్మక వాతావరణాన్ని సృష్టించింది.  అందుకే  టీడీపీ శ్రేణులూ తిరగబడ్డాయి. దీంతో  వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు కొన్ని చోట్ల నెలకొన్నాయి.  అయినా  అరాచకం, హింస విషయాలలో వైసీపీయులదే పై చేయి అయ్యింది. 

అయినా కూడా.. జగన్ పోలీసులు లక్షయంగా రెచ్చిపోయారు.  ప్రెస్ మీట్‌లో  కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ పేరు ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను తెలుగుదేశం కార్యకర్తగా అభివర్ణించారు. ఇక పోతే తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవి కడప జిల్లాలో తొలి సారిగా ఫెయిర్ ఎలక్షన్ జరుగుతోందని చేసిన వ్యాఖ్యలు.. అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది. గతంలో పులివెందులలో వేరే వాళ్లు నామినేషన్లు వేయగలిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పడు  వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారు. అందుకే బీటెక్ రవి పులివెందులలో ఫెయిర్ ఎలక్షన్ అన్నారు.  పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడు ప్రదర్శించి హడావుడి చేసినా వెనక్కు తగ్గక తప్పలేదు.  మొత్తంగా స్థానిక సమరంలో వైసీపీ అరాచకాలను, హింసను, దౌర్జన్యాలనూ అడ్డుకోవడానికి తెలుగుదేశం శ్రేణులు ఒకింత దూకుడుగానే వ్యవహరించాయి. అవసరమైతే తామూ తిరగబడగలమని నిరూపించుకునే ప్రయత్నం చేశాయి. అది సహజం కూడా. 

​కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం తత్వం బోధపడి బొమ్మ కనిపించింది.   ఎలక్షన్ కమిషన్  గొప్ప వ్యవస్థ అనే విషయం గుర్తుకు వచ్చింది.  ఆ వ్యవస్థ తన పరువును కాపాడుకోవాలని హితవు పలికారు.   తాను అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల తాను వ్యవహరించిన తీరుకు, ఆయన సామాజిక వర్గం ఏమిటో తానే ఊహించుకుని ఆయనపై చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణలు చెప్పి.. ఇప్పుడా హితవు పలికి ఉంటే ఇంకా బాగుండేది. కానీ జగన్ కదా.. అందుకే ఇప్పుడు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ను నిందించే ప్రయత్నమే చేస్తున్నారు.   ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి మద్దతు తెలిపి తాను పెద్ద తప్పు చేశానని పదే పదే చెబుతున్నారు. భారత ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలంటున్నారు.  

పాపం ఆయనకు గతం గుర్తులేదేమో.. ఇదే జగన్ ఆంధ్రప్రదేశ్‌కే చెందిన భారత ప్రధాన న్యాయమూర్తిని   ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.  . ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని మరింత గట్టిగా చెబుతున్నారు. కానీ న్యాయవ్యవస్థ పైన, న్యాయమూర్తుల పైన ఇష్టారాజ్యంగా అసభ్యకరమైన పదజాలంతో తన అనుయాయులు పెట్టిన పోస్టుల వ్యవహారంలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా మారని పరిస్థితిని ముందు చక్కదిద్దుకుని, వారిని తీసుకుని వచ్చి న్యాయస్థానానికి అప్పజెబితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను గౌరవిస్తారని, నిజంగానే ఆయనలో మార్పు వచ్చింది అని ఎవరైనా నమ్ముతారు. లేకుంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యవస్థలనైతే అవమానపరిచారో, బాధ్యతాయుతమైనపదవుల్లో ఉన్నవారిని వ్యక్తిగతంగా ఎలా దూషించారో, వారిని వారి బాధ్యతలను నిర్వర్తించకుండా ఎలా అడ్డు పడ్డారో విస్మరించి ఇప్పుడు ఇలా సుద్దపూసను అన్నట్లుగా జగన్ చెబుతున్న సుద్దులను నమ్మడానికి జనం సిద్ధంగా లేరని ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉంది.  

ఏది ఏమైనా ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో వైసీపీ  స్థాయిలో కాకున్నా..చోట్ల తెలుగుదేశం కూడా పరిధి దాటింది. అలా జరగాల్సింది కాదు. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్ కు కూడా మేలు చేయదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి కట్టుబడటంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రతిష్టను, గుర్తింపును ఇటువంటి చర్యలు ఏదో ఒక మేరకు మసకబారుస్తాయి. ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

[Jagan Change Stand, AP Local Body Elections, Jagan Mohan Reddy, Chandrababu Naidu, YCP, TDP, Nominations, Violence, Andhra Pradesh Politics]