జె.డి.లక్ష్మీనారాయణ ఆస్తులపై కన్నేసిన జగన్
Published on: Fri Jul 13, 2012 9:37AM
సి.బి.ఐ . జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్‌ను ప్రపంచానికి వెల్లడి చేసి ఆయనను ఇరుకున పెట్టిన జగన్ శిబిరం ఇప్పుడు ఆయన ఆస్తులపై కన్నేసినట్లు తెలిసింది. లక్ష్మీనారాయణ గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు ? అక్కడ ఆయనకు గాని ఆయన బంధువులకు గాని ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆయనకు ఆయా ప్రాంతాల్లో ఎవరైనా విరోధులు ఉన్నారా? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. దీనికై జగన్ శిబిరం ఒక ప్రైవేట్ డిటెక్టీవ్ ఏజెన్సీని నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
లక్ష్మీనారాయణ మహరాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పోలీస్ సూపరింటిండెంట్‌గా పని చేశారు. కొంతకాలం యాంటి టెర్రరిజం స్క్వాడ్‌లో పని చేశారు. ఆయన పని చేసిన జిల్లాలో ఆయనకు గాని ఆయన బంధువుల పేరిట గాని ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆయనను వ్యతిరేకించిన వారెవరైనా ఉన్నారా అన్న విషయాలు ఆరా తీస్తున్నారు. సమాచార హక్కు చట్టంక్రింద ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు లక్షీ నారాయణ ప్రకటించిన ఆస్తులపై సమాచారం కోరినట్లు తెలిసింది. మహరాష్ట్రలో ఆయనకు కొద్ది పాటి ఆస్తులు ఉన్నట్లు తెలిసింది.
అయితే వాటి విలువ ఎంత? దీని కొనుగోలులో ఏమైనా అవకతవకలు జరిగాయా ? ఈ ఆస్తులు కొన్నప్పుడు వాటి మార్కెట్ విలువ ఎంత? రిజిస్ట్రేషన్‌ను ఎంతకు చేశారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారు ? అన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ లావదేవీల్లో ఏ చిన్నపాటి లోపం కనిపించినా దానిపై నానా యాగీ చేసి ఆయనను ఇరుకున పెట్టాలని జగన్ శిబిరం ఆశిస్తోంది. లక్ష్మీనారాయణ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఆయన ఈనెల 16 వ తేదీన తిరిగి ఇండియా రానున్నారు. ఆయన వచ్చేలోగా ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయాలనే తలంపుతో జగన్ శిబిరం ఉంది.


