టిడిపిని టార్గెట్ చేయ్యొద్దు ఖబడ్దార్ :రేవంత్
Published on: Tue Jan 3, 2012 2:41PM
హైదరాబా
ద్: సాధారణంగా ఎ-1గా ఉన్న వ్యక్తిని ముందుగా అరెస్టు చేస్తారని కానీ జగన్ కేసులో అలా జరగలేదని దానిపై సిబిఐ వివరాలు వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కోరారు. జగన్ ఆస్తుల కేసులో ఎ-1గా ఉన్న నిందితుడిని కాకుండా ఎ-2గా ఉన్న విజయ సాయి రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో సిబిఐ వివరణ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాయిరెడ్డి అరెస్టుతో ఏడేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాలు వాస్తవమని నిరూపితమయ్యాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కోదండరామ్‌కు ప్రొఫెసర్ పదవి కట్టబెట్టినట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.కెసిఆర్, కోదండరామ్‌లకు దమ్ముంటే చంద్రబాబు తెలంగాణ యాత్రను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. టిడిపికి వ్యతిరేకంగా ఉద్యమకారులను రెచ్చగొట్టడం వారు మానుకోవాలని హితవు పలికారు. మేం తల్చుకుంటే వారు ఇంట్లోంచి కాలు బయట పెట్టలేరన్నారు. మా అలుసును చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. వారి తీరు చూస్తుంటే ప్రభుత్వాన్ని కాపాడేందుకే వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఉద్యమం ముసుగులో అమాయక విద్యార్థులను బలి చేస్తున్నారన్నారు. సోనియా గాంధీకి ఊడిగం చేయాలని, కాంగ్రెసుకు బానిసలుగా పడి ఉండాలని వారు అనుకుంటే ఉండవచ్చునన్నారు. కానీ టిడిపిని టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టవద్దన్నారు.
కల్తీ సారా విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణలో ఏ పార్టీ వారు ఆ సంఘటన వెనుక ఉన్నారో తెలుస్తుందన్నారు. మంత్రులు, అధికార పార్టీ నేతల మామూళ్ల మత్తులో మునిగిపోయారని ఆరోపించారు. మద్యం సిండికేట్లపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వడంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు.


