దమ్ముంటే వచ్చి కేసులను ఎదుర్కోవాలి: విహెచ్
Published on: Tue Jan 3, 2012 1:58PM
మెదక్
: జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన విజయ సాయి రెడ్డి సిబిఐ విచారణలో వాస్తవాలు దాచిపెడుతున్నట్లుగా అర్థమవుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అనుమానం వ్యక్తం చేశారు. సర్కారు నుండి లబ్ధి పొందిన పెద్దలు, బినామీ పేర్లతో జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. సాక్షి దిన పత్రికకు పెట్టుబడులు సేకరించడంలో ఆయనదే కీలక పాత్ర అన్నారు. అరెస్టైన విజయ సాయి రెడ్డి వెనుక ఉన్న ప్రబలమైన శక్తి ఎవరో బయటకు రావాలని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.తనకు అధికారం ఇస్తే రాష్ట్రంలో స్వర్ణయుగం తెస్తానంటున్న నాయకుడు దమ్ముంటే బయటకు వచ్చి కేసులను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.


