అలీకి జగనన్న బంపర్ ఆఫర్!?.. పండగ చేస్తో...
Published on: Fri Feb 11, 2022 1:32PM
ప్రముఖ సినీ నటుడు అలీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారా? అలీని సీఎం జగన్ రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల వివాదంపై గురువారంనాడు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అలీ, పోసాని, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. చర్చల అనంతరం వారం రోజుల తర్వాత వచ్చి తనను కలవాలని అలీకి జగన్ సూచించారు. దీంతో అలీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకే వారం తర్వాత తనను కలవమని చెప్పారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మరో మూడు నెలల తర్వాత ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఇందులో ఒక సీటును మైనారిటీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సీటును అలీకి కేటాయించాలని జగన్ చూచాయగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికల సందర్భంగా అలీ రాజమండ్రి టికెట్ ఆశించారు. అయితే.. సమీకరణాల దృష్ట్యా అలీకి రాజమండ్రి టికెట్ ను జగన్ ఇవ్వలేకపోయారు. అయినా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో అలీ పాల్గొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగా కూడా అలీ పేరు తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా అలీకి నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలో జగన్ తనను కలవాలని సీఎం కోరడాన్ని బట్టి చూస్తే అలీకి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చేందుకే అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ విషయమై అలీ మాట్లాడుతూ.. సీఎం తనను వారం రోజుల తర్వాత కలవమన్నారు. ఆయన ఏమి ఇస్తారో తనకు తెలియదని అంటూ లోలోపల నవ్వుకుంటూ వెళ్లారట.


