TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీబీఐకి చుక్కలు చూపిస్తున్న విజయ సాయి

Published on: Thu Jan 5, 2012 12:01PM

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసినా చాలా హుషారుగా ఉంటున్నారు. సీబీఐ అరెస్టు చేసి వాహనంలో జైలుకు తీసుకువెళుతుంటే మీడియాను చూసి చేతులు ఊపుతూ నవ్వుతూ వెళ్లారు. అంతేకాదు.. విచారణను సీబీఐ కస్టడీలో కాకుండా జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి వచ్చి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండేట్లు కోర్టు ద్వారా సీబీఐకి మార్గదర్శకాలు ఇప్పించేట్లు చేశారు. ఎదుటివారి బాడీలాంగ్వేజ్‌ను పట్టేసి దానికి తగ్గట్లుగా ప్రవర్తించే విజయసాయిరెడ్డి సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఎదురుదాడికి దిగారు. అంతేకాదు.. సీబీఐ అరెస్టు చేస్తుందని ముందే అంచనాకు వచ్చేసిన విజయసాయిరెడ్డి అందుకు మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్ని వారాలకు ముందు నుంచే చెక్ పవర్‌ను వదులుకున్నారు. అంతేకాదు విచారణ పేరుతో పిలిపించే బదులు తనను సీబీఐ ఎప్పుడు అరెస్టు చేస్తుందా అని ఎదురుచూసినట్లుగా ఉన్నదని ఆయన్ని చూస్తే అర్థమవుతుంది.

అరెస్టు తర్వాత ఆయన "దూకుడు"ను చూసి సీబీఐ అసహనానికి, తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం. మరోవైపు మొన్న కోర్టు ప్రాంగణంలో ఎస్కార్ట్ పోలీసులను తోసేసినందుకు జడ్జి నుంచి మందలింపులు వచ్చాయంటే ఆయన ప్రవర్తన ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు కేసు గురించి విచారణ జరిగేటపుడు కోర్టు సెంట్రల్ హాలులోనే ఉంటానంటూ పట్టుబడుతున్నారు. మిస్టర్ క్లీన్ అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డి నుంచి సీబీఐ మాత్రం ఎన్నిరోజులు విచారణ జరుపుతున్నా కొత్త విషయాలు మాత్రం రాబట్టలేకపోతున్నారట. అయితే తమ వద్ద ఆధారాలున్నాయనీ, వాటిని విజయసాయిరెడ్డి నోటి ద్వారా రప్పించేందుకు చూస్తున్నామని అధికారులు చెపుతున్నారు. మొత్తానికి సీబీఐకి విజయసాయి రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు.