TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విదేశీ పర్యటనలకు ఏ1 ఏ2 వేర్వేరు పిటిషన్లు

Published on: Wed Aug 21, 2024 12:12PM

అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2లు ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే సారి విదేశాలకు వెళ్లేందుకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ అయితే లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెండు నెలల పాటు యూకే, స్వీడన్ , అమెరికా దేశాల పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై సీబీఐ కోర్టు మంగళవారం (ఆగస్టు 20) విచారించింది. విజయసాయి పిటిషన్ ను ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు, జగన్ పిటిషన్ విచారణను బుధవారం (ఆగస్టు21)కి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.ఇక విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో ఇరు వైపుల వాదనలూ విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30కి వాయిదా వేసింది. 

జగన్, విజయసాయిలు ఇరువురూ కూడా అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపారు. గత పదేళ్లుగా బెయిలుపై ఉన్నారు. కోర్టు అనుమతితో విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కాలంలో కోర్టులు జగన్కు పలు మినహాయింపులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు దొరికింది. అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదు. ఒక ఎమ్మెల్యే మాత్రమే. అంతే కాదు వ్యక్తిగత హాజరు మినహాయింపు కూడా లేదు. అలా మినహాయింపు అవసరమనుకుంటే ఆయన కోర్టును ఆశ్రయించాల్సి ఉంది. మరి ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.