సుచరితపై వేటు!.. జగనన్న ఫుల్ సీరియస్!
Published on: Tue Apr 12, 2022 12:47PM
మేకతోటి సుచరిత. మాజీ హోంమంత్రి. దళిత ఎమ్మెల్యే. మంత్రిగా జగన్, సీఎంవో డైరెక్షన్‌లో చెప్పింది చెప్పినట్టు చేసేవారు. అయినా, జగనన్న ఆమెకు ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు. పాత కేబినెట్‌లో ఐదుగురు దళిత మంత్రులు ఉండగా.. వారిలో నలుగురికి మరో అవకాశం ఇచ్చి.. సుచరితను మాత్రం పక్కన పెట్టేశారు. నమ్ముకున్న జగనన్న.. తనకు ఇంతటి నమ్మక ద్రోహం చేశారంటూ సుచరిత అసంతృప్తి, అసహనంతో రగిలిపోయారు. ఆమె అనుచర వర్గం తీవ్ర ఆందోళన చేసింది.
సుచరితకు నచ్చజెప్పేందుకు ఎంపీ మోపిదేవి రాయబారిగా వచ్చారు. బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా, తగ్గేదేలే అంటూ స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి.. మోపిదేవి చేతిలో పెట్టేశారు. సుచరిత కూతురు మీడియా ముందుకు వచ్చి.. అమ్మ రాజీనామా గురించి ప్రకటించేశారు. ఇదంతా ఆదివారం రాత్రి జరిగింది.
కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సుచరితను పార్టీ అధిష్టానం పట్టించుకున్నదే లేదు. ఒక్కసారి ఎంపీ మోపిదేవి వచ్చి వెళ్లారు అంతే. మళ్లీ ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు పార్టీ వర్గాలు. అదే, బాలినేని విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. స్వయంగా సజ్జలనే.. మూడు సార్లు బాలినేని ఇంటికి వెళ్లి బతిమిలాడుకున్నారు. నచ్చజెప్పి.. జగన్ దగ్గరకు రప్పించి.. కాంప్రమైజ్ చేశారు. బయటికి వచ్చిన బాలినేని అంతా తూచ్.. తాను జగన్ కోసం చిత్తశుద్ధిగా పని చేస్తానంటూ తుస్సు మనిపించారు. ఇక, అలకబూనిని ఉదయభాను, పార్థసారధి తదితరులనూ కూల్ చేశారు మధ్యవర్తులు. కానీ, సుచరిత విషయంలో మాత్రం అలా జరగలేదు.
దళిత ఎమ్మెల్యే సుచరిత.. జగన్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తారా? ముఖం మీదే రాజీనామా చేసేస్తారా? ఎంత ధైర్యం? ఏమిటీ ధిక్కరణ? అంటూ అధిష్టానం ఆమెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే, ఎంపీ మోపిదేవి మరోసారి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్లూ రాలేదు. కూల్ చేయడం కాదుకదా.. అసలు సుచరితను పట్టించుకోవట్లేదు పార్టీ. మూడేళ్ల పాటు హోంమంత్రిగా ఓ వెలుగు వెలిగిన సుచరితను.. కూరలో కరివేపాకులా ఇప్పుడిలా తీసిపారేయడం దారుణం అంటున్నారు ఆమె అనుచరులు.
పట్టించుకోకపోవడమే కాదు.. సుచరితపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తోందట వైసీపీ అధిష్టానం. బాలినేని, పిన్నెళ్లి, కోటంరెడ్డి, సామినేని లాంటి వాళ్లు తమ ఆవేదనను, అసంతృప్తిని వెళ్లగక్కారే గానీ.. రాజీనామా చేసేంత తెగించలేదని అంటున్నారు. అదే సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి.. జగన్ నాయకత్వాన్ని ధిక్కరించారని.. ఆ ధిక్కరణ జగన్ ఇగోను హర్ట్ చేసిందని.. అందుకే, ఆమెకు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.


