ఎన్టీఆర్ గడ్డపైనే టీడీపీకి ఎదురుదెబ్బ... జగన్ కు ఫిర్యాదులు...

 

ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులోనే టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా జగన్ మోహన్ రెడ్డి దగ్గర. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిద్దామా అని జగన్ చూస్తూ ఉంటాడు. అంతేకాదు... పాదయాత్ర మొత్తం మీద ఆయన చంద్రబాబును బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటిది.. ఆయన దగ్గరే టీడీపీ నేతల ఘనకార్యాలు చెబితే ఎలా ఉంటుంది. జగన్ దగ్గర అడ్డంగా బుక్కయ్యారు.

 

ప్రస్తుతం జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జగన్ కృష్ణా జిల్లాకు ఓ హామీ ఇచ్చారు. తాను కనుక అధికారంలోకి వస్తే.. కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరును పెడతానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాకు తాను ఎన్టీఆర్ పేరు పెడతానని ఆయన ప్రకటించిన వేళ, ప్రజలు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇక జగన్ ప్రకటనపై స్పందించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆయన చేసిన ప్రకటనను స్వాగతించారు. తన అల్లుడు చంద్రబాబునాయుడు, కొడుకు బాలకృష్ణ చేయలేని జగన్ చేస్తున్నాడని... చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అంతేకాదు.. ప్రత్యేక హోదాపై జగన్ అలుపెరగని పోరాటం చేస్తుంటే, తెలుగుదేశం నేతలు చిత్తశుద్ధి లేని డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు.

 

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.... ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. నీరు-చెట్టు పథకం టీడీపీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని  స్వయంగా ఎన్టీఆర్‌ బంధువులే వైఎస్‌ జగన్‌కు చూపించారట. ఈ పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని.. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్‌కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అ‍క్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. అంతేకాదు... ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్‌ జగన్‌ చూపించారట. అంతేకాకుండా మళ్లీ లేబర్‌ను పెట్టి తవ్వించామని చెప్పి ప్రభుత్వం నుంచి డబ్బును తీసుకుంటున్నారని సర్కారు అవినీతి ఎండగట్టారు. మరి సొంత బంధువులే ఇలా చెబితే.. జగన్ ఇంక ఊరుకుంటాడా...? రెచ్చిపోడూ...