వైసీపీ రాజీనామాల ప్లాన్ మోడీదే!

 

ఎవరు నమ్మినా, నమ్మకపోయినా వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ బంధం తెగిపోవడం ఖాయం. బీజేపీ, వైసీపీ కొత్త స్నేహితులుగా మారి ఎన్నికల పొత్తుతో పోటీలోకి దిగడమూ ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ సెమీఫైనల్స్‌గా చెప్పుకోవచ్చు. రెండు పార్టీలు విడిపోయే ముందు... రెండు పార్టీలు స్నేహం ప్రారంభించే ముందు ఏర్పడే సంధికాలం ఇది. ఈ సంధికాలంలో రాజకీయాల్లో ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలూ జరుగుతూ వుంటాయి. వ్యూహప్రతి వ్యూహాలు కనిపిస్తూ వుంటాయి. ఇలాంటి వాటిని గమనిస్తూ వుండటమే పౌరులుగా మన కర్తవ్యం. ఏపీలో అధికారంలో భాగస్వామిగా వున్న బీజేపీ క్రమంగా టీడీపీ మీద విమర్శల దాడిని పెంచడం ఇలాంటి సంధికాలపు చర్యల్లో భాగమే. ఇటు వైసీపీ వైపు నుంచి రాజీనామాల అస్త్ర ప్రయోగం కూడా ఇలాంటి సంధికాలపు చర్యేనని రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. వైసీపీ రాజీనామాల బెదిరింపు వెనుక ప్రధానమంత్రి మోడీ ప్లాన్ వుందని అనుమానిస్తున్నారు.

 

నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తూ వచ్చింది. బీజేపీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌లో కూడా సదరు మొండిచెయ్యిని ప్రధాని మోడీ కంటిన్యూ చేశారు. దాంతో ఇప్పటి వరకూ ఓర్పు వహిస్తూ వచ్చిన టీడీపీ నాయకత్వం మోడీ ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి దిగింది. టీడీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో చేసిన నిరసన మోడీకి ముచ్చెమటలు పట్టించింది. గతంలో మాదిరిగానే కుక్కిన పేనుల్లా పడి వుంటారని అనుకున్న మోడీ ఈ ధిక్కారాన్ని భరించలేకపోయారు. ఏపీలో వైసీపీతో పొత్తు అనధికారికంగా ఎలాగూ ఖాయమైపోయింది కాబట్టి, టీడీపీమీద పైచేయి సాధించడానికి వైసీపీని పావులా వాడుకోవాలని మోడీ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల చేత ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయించి, వారి చేత అక్కడే రాజీనామాలు చేయించే వ్యూహం మోడీదేనని పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ ఎంపీలు చేసిన పోరాటం రాజకీయంగా వారికి ఉపయోగపడకుండా చేయాలన్నదే మోడీ పెద్ద ప్లాన్. టీడీపీ ఎంపీలో ఏపీ కోసం పార్లమెంటులో గొడవ మాత్రమే చేశారు... వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏకంగా రాజీనామాలే చేసేశారన్న కలరింగ్ రావడం కోసమే వైసీపీ నాయకుడు జగన్ మోడీ వ్యూహంలో తాను కూడా భాగస్వామి అయ్యాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.