ఇలా ఇరుక్కుపోయానేంటి సామి....

 

పాపం రాజమౌళికి బలే చిక్కు వచ్చి పడింది. సినిమాలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని రాజమౌళి..పాపం అనవసరంగా రాజకీయాల్లో చిక్కుకున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? బాహుబలి సినిమాకు రాజమౌళి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే కదా. సినిమా గ్రాఫిక్స్ విషయంలో కానీ, సినిమా సెట్ ల విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాహుబలిని తీసి ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించాడు. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజమౌళి సలహా కోరారు. ఏ విషయంలో మీకు కూడా తెలిసిందే కదా. అమరావతి విషయంలో. రాజధాని డిజైన్ లలో సలహాలు, సూచనల కోసం రాజమౌళి సాయం కోరారు. అయితే ముందు రాజమౌళికి అంత ఇంట్రస్ట్ లేకపోయినా చెప్పింది ఏకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడంతో... రాజమౌళి సరే అని ఒప్పుకున్నారు. ఇక ఒప్పుకున్నందుకు సలహాలు ఇవ్వాలి కదా... అందుకే ఈ డిజైన్ల రూపకల్పనలో భాగంగా.. ఆయన విదేశాలకు కూడా వెళ్లాడు. అమరావతి ఆకృతుల్లో భారతీయ, ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేంచే కొన్ని సలహాలు ఇచ్చారు. ఇక దీనిపై మాట్లాడిన రాజమౌళి.. ఈ వ్యవహారం అంతా రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటిదని తాను చిన్నవాడినని చెప్పకనే చెప్పాడు కూడా.

 

అయితే పాపం రాజమౌళిని కూడా వదిలిపెట్టలేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మీద ఎలాగూ ఆయన 24 గంటలు.. విమర్శలు గుప్పిస్తుంటాడు. ఇక ఇటీవల చంద్రబాబుకి అండగా నిలుస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓ యాక్టర్ గా సంబోధిస్తూ ఆయనపై కూడా విరుచుకుపడుతున్నాడు. ఇవన్నీ ఓకే కానీ... ఇప్పుడు ఈ సీన్ లోకి  రాజమౌళిని కూడా లాగుతున్నారు. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని.. అమరావతిలో ఓ ఇటుక కూడా వేయని చంద్రబాబు దానిపై సినిమా తీయమని ఓ దర్శకుడుని పిలిచారని జగన్ కామెంట్ చేశారు. ఆ సినిమాలో తన పాత్ర , నారాయణ పాత్ర బాగా వుండాలని కూడా చంద్రబాబు కోరినట్టు జగన్ అన్నారు. చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఈ యాక్టర్లు, దర్శకులు భలే చేస్తున్నారని మనలను నమ్మిస్తారు అని జగన్ చేసిన కామెంట్స్ లో పవన్ తో రాజమౌళిని కలిపి కామెంట్స్ చేశారు. పాపం జగన్ చేసిన కామెంట్స్ పై రాజమౌళి హర్ట్ అయ్యారట. అమరావతికి సంబంధించి తన పాత్ర ఎంత పరిమితమో చెప్పాక కూడా జగన్ ఇలా అనడం మీద రాజమౌళి ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతోందట. మొత్తానికి విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం అన్న సామెత ప్రకారం... రాజమౌళి జగన్, చంద్రబాబు మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఎక్స్ పీరియన్స్ తో రాజమౌళి ఇలాంటి విషయాల్లో వేలు పెట్టరేమో...