సోనియాగాంధీతో అందుకే చెడింది...

 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత... సోనియాకు.. జగన్మోహన్ రెడ్డికి మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇక ఆ తరువాత రాష్ట్రం విడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ మరుగున పడింది. ఇక ఇప్పట్లో పార్టీ పుంజుకుంటుదన్న హోప్స్ కూడా లేవు. అయితే ఇప్పుడు తనకు, సోనియాకు మధ్య వచ్చిన విబేధాలు గురించి మాట్లాడాడు.

 

ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన పాదయాత్ర మొదలుపెట్టి నెలరోజులు గడిచిన సందర్భంలో...ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన.. తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిస్థితులను వివరించారు. సోనియాగాంధీతో ఏర్పడిన వివాదానికి గల కారణాలను బయటపెట్టారు. సోనియా తన ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదన్నారు. ఆమెకు తన గురించి లేనిపోనివి చెప్పారో, లేక ఆమె మైండ్‌సెట్ మారిందో తెలియదు కానీ ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదని చెప్పారు. యాత్రకు ఉన్న సెంటిమెంటును, దానితో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్‌ను ఆమె అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. తాను, అమ్మ, పాప ముగ్గురం కలిసి చివరిగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఒప్పించాలని వెళ్లామని, అయితే ఎంత చెప్పినా సోనియా వినలేదని వివరించారు.  అందరినీ ఒకే చోటకు పిలిపించి ఓదార్చండి అన్నారని జగన్ గుర్తు చేశారు.సోనియా కనుక ఆరోజు ఒప్పుకుని ఉంటే సమస్య ఇంతదూరం వచ్చి ఉండేది కాదని అన్నారు. అసలు ఓదార్పు యాత్రకు ఆమె పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చేందుకు ఇంకొకరి అనుమతి కావాలనుకోవడమే బిగ్గెస్ట్ ఆశ్చర్యం అని జగన్ అన్నారు.

 

కానీ తనకు పదవి ఇవ్వలేదన్న కోపంతో జగన్ పార్టీ నుండి బయటకు వచ్చి.. కొత్త పార్టీ పెట్టాడన్న వార్తలు గతంలో వచ్చాయి. మరి నిజంగా పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదనే జగన్ పార్టీ నుండి బయటకు వచ్చాడా...? లేక పదవి ఇవ్వలేదని పార్టీ నుండి బయటకు వచ్చాడా.. ? అది జగన్ కే తెలియాలి.