నంద్యాల వైసీపీ అభ్యర్ధి ఖరారు... కాక రేపుతోన్న జగన్‌ నిర్ణయం


 

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికకు వైసీపీ తరఫున అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమవగా... భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరడంతో ఈ స్థానం తమదేనని, మళ్లీ తమ ఖాతాలో వేసుకుంటామని వైసీపీ చెబుతోంది, అందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. టీడీపీ నుంచి భూమా ఫ్యామిలీ బరిలోకి దిగితే... భూమా కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న గంగుల కుటుంబానికే టికెట్ ఇవ్వాలని డిసైడైనట్లు తెలుస్తోంది.

 

గంగుల కుటుంబం నుంచి వైసీపీ గూటికి చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డికి నెల రోజులు తిరగక ముందే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్‌. దాంతో గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న ప్రతాప్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వైఎస్ జగన్‌‌తో ప్రతాప్ రెడ్డి భేటీ కావడంతో ఆ వార్తకు బలం చేకూరింది. ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే నంద్యాల ఉపఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రతాప్ రెడ్డి చేరికపై జిల్లా వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పార్టీలో చేరగానే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమేంటని పార్టీ అధిష్టానంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

గంగుల కుటుంబానికి ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. మళ్లీ అదే కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారంతా జగన్‌తో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డి... టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకే టికెట్‌ దక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు. అయితే సడన్‌గా గంగుల ప్రతాప్‌రెడ్డి పేరు తెరపైకి రావడంతో... తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నేతలకు నచ్చజెప్పి గంగుల ప్రతాప్‌‌రెడ్డికే టికెట్‌ ఇచ్చేందుకు జగన్‌ డిసైడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి నంద్యాల టికెట్‌ గొడవ వైసీపీలో ఎలాంటి చిచ్చు పెడుతుందో చూడాలి.