జనంలో జగన్ వున్నాడు! కాని, జగన్ లో పరిపక్వత ఏది?

 

తండ్రి హఠాన్మరణంతో జగన్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాడు. అంతకుముందు ఎంపీగా వుంటూ వ్యాపారాలు చేసిన ఆయన వైఎస్ మరణంతో డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, జనంలో ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతే లభించింది యువనేతకి. ప్రత్యక్ష ఎన్నికల్లో పదే పదే గెలుపుని అందించారు. కాని, అంతటి నమ్మకాన్ని కూడా జగన్ ఎందుకని క్యాష్ చేసుకోలేకపోతున్నాడు? సీఎం అవ్వలేకపోవటానికి, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సత్తా చాటటానికి ఎందుకు ఆయన సమర్థత చాలటం లేదు?

 

గత కొన్ని రోజులుగా సభలో జగన్ వ్యవహారం చూస్తే మనకు లోపం ఎక్కడుందో తెలిసిపోతుంది! ఆయన జన జీవనంలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడి స్థాయికైతే వచ్చాడు కాని... దానికి తగ్గ పరిపక్వత మాత్రం సాధించలేకపోతున్నాడు. పంతానికి, పట్టుదలకి పోయే ఫ్యాక్షనిస్ట్ మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలా మసులుకోవటం లేదు. తాను చేసే పని రాజకీయంగా ఎలాంటి లాభ, నష్టాలు కలిగిస్తుందని కాక తనకి నచ్చిందే చేస్తూ పో్తున్నాడు. ఇక్కడే జనానికి, జగన్ కి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది!

 

ఈ సారి సమావేశాలు ప్రారంభం కాగానే భూమా నాగిరెడ్డికి సంతాపం తెలిపే సమయంలో జగన్ తప్పటడుగు వేశాడు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో శత్రు, మిత్ర భేదాలు మరిచి అంతా సంస్మరణ చేసుకుంటారు. కాని జగన్ సభలో కూర్చుని నాలుగు మాటలు మాట్లాడకుండా జనంలోకి తప్పుడు సంకేతాలు పంపాడు. కారణం అడిగితే... భూమా పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడాల్సి వస్తుందని సభకు రాలేదని చెప్పాడు. ఇది మెచ్యురిటీ వున్న నేతల లక్షణం అస్సలు కాదు.

 

ఇక తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారం కూడా జగన్ కు రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చింది! మొదట దూకుడుగా పోయిన వైసీపీ అగ్రిగోల్డ్ బాధితుల కోసం చర్చ చేపట్టాలని కోరింది. పనిలో పనిగా జగన్ ప్రత్తిపాటిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాన్ని అవకాశంగా దొరకపుచ్చుకున్న టీడీపీ ప్రతి దాడి చేసింది. శరణమా... మరణమా అంటూ దర్యాప్తుకు ఒప్పుకోమని కార్నర్ చేసింది. అంతదాకా వచ్చాక జగన్ ప్రత్తిపాటి పై తాను చేసిన ఆరోపణలకి కట్టుబడి వుంటే బావుండేది. కారణం ఏంటో కాని... జగన్ ఆ విషయంలో అధికార పక్షం ఎంతగా రెచ్చగొట్టినా తమాయించుకుని ఊరకుండిపోయాడు! అంటే, ప్రత్తిపాటిపై తాను చేసిన ఆరోపణలు, ఆ డాక్యుమెంట్లు అన్నీ ఉత్తివేనా? జనానికి చివరగా మిగిలిన అనుమానం ఇదే!

 

రాజకీయ శత్రుత్వం వున్నా కూడా కొన్ని విషయాల్లో పట్టువిడుపులు వుండటం ప్రజాస్వామ్యంలో హుందాతనం ఇస్తుంది. తనని దారుణంగా ఓడించిన యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి అఖిలేష్ , ములాయంతో కలిసి వచ్చాడు. కాని, ఇక్కడ జగన్ నూతన అసెంబ్లీ, సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాడు. సభలో సంతాప తీర్మానాలకి వుండడు, చివరకు, ఇవాళ్ల జరిగిన అమరావతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి కూడా ఆయన డుమ్మా కొట్టాడు! అవకాశం వస్తే ప్రభుత్వం లోపాలు ఎత్తి చూపాలి తప్ప... ఇలా పలాయనం చిత్తగిస్తే జనం క్రమక్రమంగా నమ్మకాన్ని కోల్పోతారు. దీనిపై యువనేత సీరియస్ గా దృష్టి సారించాలి!