అసెంబ్లీలో సీట్లున్నాయి... ఆంధ్రాలో ఆఫీసు మాత్రం లేదు! 


కొందరు నేతలు ఏదైనా పని చేస్తే దాంట్లో గొప్ప అంతరార్థం వుంటుంది.అది మనకు అప్పటికప్పుడు అర్థం కాకపోవచ్చు కాని టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది.వాజ్ పేయి,పీవీ నరసింహారావు లాంటి రాజకీయ నేతల్ని ఈ కోవలో జమకట్టవచ్చు.కాని, కొందరు నేతలు కొన్ని పనులు చేస్తుంటే మనకు ఏమీ అర్థం కాదు.ఎందుకంటే,నిజంగా కూడా అందులో పెద్దగా లాజిక్ వుండదు కాబట్టి!ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ వైఖరి అలాగే తయారైంది.ఆయన చేసే చాలా పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు.అలాగని వాటిల్లో పెద్దగా రాజకీయ చాణక్యం కూడా వుండదు...


రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రాంతంలో వైసీపీకి మిగిలింది ఆంద్రా మాత్రమే.అక్కడ ఏకైక ప్రతిపక్షంగా నిలిచి భవిష్యత్ పై ఆశలు నిలుపుకుంది.కాని,వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రవర్తన ఆ పార్టీలోని చాలా మంది నాయకులకి మింగుపడటం లేదు.అసలు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుదామని అనుకుంటున్నారా లేదా అనేది వాళ్లకిప్పుడు వస్తోన్న డౌట్!ఎందుకంటే,రాష్ట్ర విభజన జరిగిన ఇన్నాళ్లు అయిపోతున్నా వైసీపీ పూర్తి స్థాయిలో అమరావతికి చేరుకోలేదు.కనీసం పార్టీకి అక్కడ కార్యాలయం కూడా లేదు.ఇప్పటికీ జగన్ , ఆయన ఎమ్మెల్యేలు ఏదైనా మీడియా మీట్ పెట్టాలంటే హైద్రాబాదే దిక్కు.మరో వైపు టీడీపీ ఎప్పుడో గుంటూరులో కార్యాలయం ఏర్పాటు చేసింది.జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజీపీ,కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆంధ్రాలో మకాం చేసేశాయి.కాని,జనం ప్రధాన ప్రతిపక్షంగా పట్టం కట్టిన ఫ్యాను పార్టీకి మాత్రం ఇంకా గాలి అటు మళ్లటం లేదు!


విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న భూమి కూడా వద్దని జగన్ తమకు కావాల్సిన చోట తామే ఆపీస్ కట్టుకుంటామని చెప్చుకొచ్చారు.అయినా ఇంత వరకూ అమరావతిలో వైసీపీ ఆఫీస్ ఏర్పాటు చేసిన దాఖలా లేదు.అంతా హైద్రాబాద్ నుంచే నడుస్తోంది.రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటోన్న యువ నేత ఇలా రాజధానికి దూరంగా వుండిపోవటం ఏంటని అంతా వాపోతున్నారు.మరో రాష్ట్రపు రాజధానిలో ప్రశాంతంగా కూర్చుని రాజకీయాలు జరుపుతుంటే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయోనని వైసీపీ సీనియర్లు తెగ టెన్షన్ పడుతున్నారు!


పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలించకపోవటంలో జగన్ పెద్దగా రాజకీయ వ్యూహం అనుసరిస్తున్నారని కూడా భావించటానికి లేదు.రెండు చోట్లా ఆఫీసులు నడిపటం వేరు కాని... ఇంకా హైద్రాబాద్ నే పట్టుకుని వేలాడుతూ సీట్లిచ్చిన ఆంధ్రా జనాన్ని పట్టించుకోకపోవటం, ఎంతైనా డేంజరే!ఇప్పటికైనా జగన్ అమరావతి ట్రైన్ ఎక్కితే చాలా బెటర్...