TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. జగన్ జెండా ఎక్కడా..?

Published on: Tue Jan 12, 2016 4:07PM

గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి వారు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. గెలవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక అధికార పార్టీ అయితే సెటిలర్లను ఆకర్షించడానికి బానే కష్టపడుతున్నారు. ప్రచారంలో సీమాంధ్రులు మెచ్చే మాటలు మాట్లాడుతున్నారు. కానీ అన్ని పార్టీల సంగతి పక్కన పెడితే.. వైసీపీ హడావుడి మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల బరిలో నుండి వైసీపీ తప్పుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే వైకాపా అధినేత జగన్ కూడా ఈ గ్రేటర్ ఎన్నికల బరిలో దిగకూడదని నిర్ణయించుకన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే కారణమట. వరంగల్ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేసింది. వైసీపీ నుండి త‌న పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలో దింపి ఎన్నికల ప్రచారానికి జగన్ కూడా వెళ్లారు. కానీ అభ్యర్ధికి మాత్రం 20వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో వైకాపాకు తెలంగాణ‌లో త‌మ బ‌లం ఏ స్థాయిలో ఉందో జగన్ కు ఓ క్లారిటీ వ‌చ్చిందంట. అందుకే ఆ పార్టీ గ్రేట‌ర్ బ‌రి నుంచి త‌ప్పుకునే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

అంతేకాదు వైసీపీ పార్టీ నేతలు కూడా ఎన్నికల్లో దిగే ఛాన్స్ లేదని అనుకుంటున్నారట. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తాము తప్పుకుంటున్నట్లు.. ఈ విషయాన్ని వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం కొంతమంది పార్టీ నేతలకు అసంతృప్తికరంగా ఉందంట. గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఓట్లు పడే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే వాస్తవానికి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ నుండి అభ్యర్ధులు కూడా ఎవరూ లేరంట. జగన్ కొంతమందిని పిలిచి ఎన్నికల్లో పోటీచేయాలని అడిగినా ఎవరూ ఆసక్తి చూపించలేదంట. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో జగన్ తన జెండాను పీకేసినట్టు తెలుస్తోంది.

మొత్తానికి జగన్ కు తెలంగాణలో తమకున్న పట్టు ఏంటో తెలిసింది. అనవసరంగా ఎన్నికల్లో పాల్గొని పరువు పోవడం కంటే సైలెంట్ గా ఎన్నికల నుండి తప్పుకుంటే మంచిదని అనుకున్నట్టున్నారు. మరి ముందుముందైన వచ్చే ఎన్నికల్లో అయినా పాల్గొంటారో లేదో చూడాలి.