ఇంతకీ అసెంబ్లీ సమావేశాలు దేనికోసం నిర్వహిస్తున్నట్లో?

 

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర శాసన సభలో వ్యవహరిస్తున్న తీరు చూసి విసిగిపోయిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన బహుశః హౌస్ అంటే తన ‘లోటస్ పాండ్’ హౌస్ అని భావిస్తునందునే సభా మర్యాదలు కూడా పాటించకుండా చాలా అహంకారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు కనీసం సభా వ్యవహారాలపై కూడా ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈరోజు సభలో వైకాపా సభ్యుడు జలీల్ ఖాన్ మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు శాసనసభను పార్టీ కార్యాలయంలా భావిస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కి అంతా ఏకపక్షంగా నడిపిస్తున్నారని ప్రతివిమర్శ చేసారు. ఈవిధంగా జగన్ శాసనసభను ‘లోటస్ పాండ్’ గా భావిస్తున్నారని అధికార పార్టీ ఎద్దేవా చేస్తే, అధికార పార్టీ సభను పార్టీ కార్యాలయంలా నడిపిస్తోందని ప్రతిపక్ష పార్టీ ఎద్దేవా చేసింది. అంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా సభను సభలా నడపడం లేదని అంగీకరిస్తున్నట్లే ఉంది.

 

విలువయిన ప్రజాధనంతో నడుస్తున్న చట్ట సభలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఈవిధంగా ఒకరినొకరు నిందించుకోవడానికే వృధా చేయడం బాధ్యతారాహిత్యమే. అధికార, ప్రతిపక్షాలు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేయకుండా ఈవిధంగా కాలక్షేపం చేయడం తమనెనుకొన్న ప్రజల పట్ల చులకన భావం ప్రదర్శించడమేనని చెప్పక తప్పదు. ఈ వారం రోజులలో స్సమావేశాలలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక్క ఆలోచనా చేయలేదు. ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. సభలో ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొనలేనప్పుడు, ఒకరినొకరు తిట్టుకోవడానికి, విమర్శించుకోవడానికే అయితే ప్రజాధనం వృధా చేస్తూ ఈ సమావేశాలు నిర్వహించడం దేనికి? ఆ పనేదో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీ కార్యాలయాలలోనే మీడియా సమావేశాలు పెట్టుకొని చేసుకొంటే సరిపోతుంది కదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.