TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలో జగన్ పట్టు సడలుతోందా?.. సీనియర్లపై భారం వేసి తప్పుకుంటున్నారా?

Published on: Sat Sep 19, 2026 2:42PM

ఆ పార్టీ నుంచి ఇటీవలి కాలంలో పెరుగుతున్న వలసలు, పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే.. ఆ పార్టీకి స్థానిక ఎన్నికలు అగ్నిపరీక్షగా మారేలా కనిపిస్తున్నా యంటున్నారు పరిశీలకులు. సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. స్థానిక పోరులో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకూడదు, పార్టీ గట్టి పోటీ ఇవ్వాలంటూ ఇటీవల దిశానిర్దేశం చేసిన జగన్.. తీరా కార్యరంగంలోకి దిగాల్సిన సమయంలో విదేశీ పర్యటన అంటూ వెళ్లిపోవడానికి.. పార్టీలో పెరిగిన వలసలు, అంతర్గత కుమ్ములాటలను నియంత్రించి పార్టీని గాడిలో పెట్టలేని నిస్సహాయత కూడా ఒక కారణమా అన్న కోణాల్లోనూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కూడా పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్న సమయంలోనూ జగన్ వాటిని సద్దుమణిగేలా చేయడంలో విఫలమయ్యారని ప్రస్తుత పరిస్థితితో పోలుస్తూ వైసీపీ శ్రేణుల అంతర్గత సంభాషణల్లో చర్చ జరుగుతోంది. అప్పుడంటే అధికారం చేతిలో ఉంది కనుక.. పార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరుగా దారిలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఇప్పుడు పార్టీ అధినేతగా జగన్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 

 ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ వేగంగా పట్టుకోల్పోతున్న తరుణంలో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడమెలా అని జగన్ తలపట్టుకుంటున్న పరిస్థితి ఉందంటున్నారు. ఒకవైపు సీనియర్ నేతల సస్పెన్షన్లు, మరోవైపు కీలక నాయకుల వలసలు.. స్థానిక సమరం మాట తలుచుకోవడానికే పార్టీ నేతలు, శ్రేణులలో  గుబులు పుట్టే పరిస్థితి ఉంది.   

 తాజాగా రేపల్లె నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకుడు  మోపిదేవి శ్రీనివాసరావుపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.  బాపట్ల జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సస్పెన్షన్ వైసీపీపై ప్రతికూలంగా పడింది. మరీ ముఖ్యంగా  మోపిదేవిపై సస్పెన్షన్ వేటుకు ముందు కనీసం ఆయన వివరణ కూడా తీసుకోకపోవడంపై బాపట్ల, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ శ్రేణులలో అసంతప్తి భగ్గుమంటోంది. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన నేతలకు అధిష్ఠానం ఇచ్చే మర్యాద ఇదా అన్న ఆగ్రహం వ్యక్తమౌతోంది.  

అలాగే ఉత్తరాంధ్ర రాజకీయాలు కూడా జగన్ కు  తలనొప్పిగా పరిణమించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పార్టీకి సేవలు అందించిన కీలక నేత మజ్జి శ్రీను ఇటీవల  పార్టీకి రాజీనామా చేయడం   పెద్ద ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు. ఇక  కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్ కూడా పార్టీని వీడటం చూస్తుంటే.. ఈ వలసలు ఒక ప్రవాహంగా కొనసాగే అవకాశం ఉందన్న భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమౌతోంది.  ఇందుకు నిదర్శనంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్   భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదంటూ తాజాగా చేసిన కామెంట్లను నిదర్శనంగా చూపుతున్నారు పరిశీలకులు.  

ఈ వార్త కూడా చదవండి సిట్టింగ్ స్థానాల్లోనూ పట్టు కోల్పోతున్న వైసీపీ https://teluguone.com/news/prevsingle/ycp-pride-diminishing-daybyday-2013+09-39-218165.html

ఈ నేపథ్యంలోనే తన విదేశీ పర్యటన పెట్టుకున్న జగన్.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బొత్స, తమ్మినేనిలతో భేటీ అయ్యారు. వారిని బుజ్జగించారు. వచ్చే ఎన్నికలలో మీకు పార్టీ టికెట్లు ఖాయమంటూ భరోసా ఇవ్వడమే కాకుండా వారు ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా చెప్పేశారు. అది చాలదనుకున్నారో ఏమో బొత్స కుమార్తెకు కీలక పదవి కట్టబెట్టారు.

పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేసిన తమ్మినేని కుమారుడిపై చర్యలు తీసుకోవడం అటుంచి కనీసం మందలించను కూడా లేదు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే.. పార్టీపై జగన్ కు గతంలో ఉన్న పట్టు సడలిందని అంటున్నారు. అందుకే కీలక సమయంలో విదేశీ పర్యటకు వెడుతూ.. స్థానిక ఎన్నికలలో వైసీపీ వైఫల్యం ప్రభావం తన నాయకత్వంపై పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. 

[Jagan, YCP, Loose Grip, YCP Internal, Crisis, Leaders Leave Party, Telugu One]