జగన్ కు కలిసొస్తుందా..? నేడే నిర్ణయం..

 

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈరోజు జరగబోయే కోర్టు విచారణలో అయినా కలిసివస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అవుతారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారమూ కోర్టు విచారణకు రాలేనని కోరుతూ జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే గతంలోనే పాదయాత్ర నిమిత్తం.. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే విన్నవించుకోవాలని హైకోర్టు సూచించింది.  ఆపై జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన స్పెషల్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ సైతం నేడు కోర్టుకు చేరనుంది. దీంతో ఆయన ఆ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో మరి ఈసారైనా జగన్ కు ఊరట కలుగుతుందా...? లేక చుక్కెదురవుతుందా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...