జగన్ ప్రాదాన్యత దేనికో?

 

జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవగానే ఐదు సంతకాలు చేస్తానని జనాలను ఒకటే ఊదరగొట్టారు. అంతేకాక ప్రజలకు చెప్పినవి, చెప్పనివి కూడా చాలా పనులు చేస్తానని ప్రకటించారు. బహుశః ప్రజలకు చెప్పని వాటిలో తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం కూడా ఒకటేమో! ఈ ఎన్నికలలో వైకాపా, గెలిచినా ఓడినా ఆయన తన తలపై కత్తిలా వ్రేలాడుతున్న సీబీఐ, ఈడీ కేసులు మాఫీ చేయించుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందుకే ఆయన మొదటి నుండి కూడా తనకు 30 యంపీ సీట్లు కావాలని ప్రజలను గట్టిగా కోరుతున్నారు. ఒకప్పుడు సమైక్య ఉద్యమాలు జోరుగా నడుస్తున్నవేళ తనకు 30 యంపీ సీట్లు ఇచ్చినట్లయితే, రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత జరిగే ఎన్నికలలో 30 సీట్లు వచ్చినా అదెలా సాధ్యమో ఆయన ఏనాడు వివరించలేదు. ఎవరూ ఆయనని అడగలేదు కూడా. ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక, జగన్ తన 30 యంపీ సీట్ల పాట పల్లవి, స్వరం కూడా మార్చి, ఇప్పడు వాటిని కేంద్రానికి ఎరగా వేసి దాని మెడలు వంచి నిధులు తీసుకువస్తానని గర్జించారు. తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా పెట్టి, రాష్ట్రంలో అధికారం, ముఖ్యమంత్రి పదవి, 30యంపీ సీట్లు సంపాదించుకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ ప్రజలు తనకి 30 యంపీ సీట్లు గనుక ఇచ్చినట్లయితే మళ్ళీ వాటిని పెట్టుబడిగా పెట్టి తన కేసుల నుండి విముక్తి పొందాలని ప్రయత్నిచడం తధ్యం. ఒకవేళ బీజేపీ/ఎన్డీయే కూటమి 272 యంపీ సీట్లు గెలుచుకోగలిగి, బయట పార్టీల మద్దతు ఆవసరం పడకపోయినట్లయితే, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కోర్టు గడపలు ఎక్కక తప్పదు.