రాష్ట్రపతికి జగన్ పాఠాలు అవసరమా?

 

రాజకీయాలలో నీతి నిజాయితీ, విశ్వసనీయత అంటూ నిత్యం సూక్తులు వల్లెవేసే జగన్మోహన్ రెడ్డి, ఇంతవరకు ఏనాడు కూడా వాటిలో ఏ ఒక్క లక్షణం తనకుందని నిరూపించుకోలేకపోయారు. పైగా అతని ప్రవర్తన, ఆలోచనలు, వ్యూహాలు అన్నీ ఎప్పుడూ కూడా అనుమానాస్పదంగానే ఉంటాయి.

 

గతంలో ఫ్లెక్సీ బ్యానర్ల వ్యూహంతో హరికృష్ణని, జూ.యన్టీఆర్ ని ఎగద్రోసి, నందమూరి వంశానికి, తేదేపాకు మధ్య చిచ్చు రాజేసిన తరువాత, ఆ జూ.యన్టీఆర్ ని ఘోరంగా దెబ్బతీసి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు నిమ్మకూరులో ఉన్న నందమూరు బంధువు పెద వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లి జగన్ ఏవో మంతనాలు చేయడం చూస్తే మళ్ళీ అక్కడ అతను మరో చిచ్చు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లు ఉంది.

 

సాదారణంగా ఏ రాజకీయ నాయకుడు ఎంత రాజకీయ వైరం ఉన్నపటికీ తన ప్రత్యర్ధి యొక్క నియోజక వర్గం నుండి ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకోడు. కానీ జగన్ మాత్రం చంద్రబాబు నియోజక వర్గమయిన కుప్పం నుండే తన ‘సమైక్య ఓదార్పుయాత్ర’ మొదలుపెట్టాలనుకోవడం అతని నైజానికి అద్దం పడుతోంది.

 

ఒకవైపు సమైక్యాంధ్ర సెంటిమెంటు మరో వైపు తన తండ్రి పేరు చెప్పుకొని ఓదార్పు సెంటిమెంటుతో ప్రజల అభిమానం, సానుభూతి పొంది వచ్చే ఎన్నికలలో ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ చేస్తున్నఈ ప్రయత్నాలను ప్రజలు అర్ధం చేసుకోలేరని భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను ఈ రెండు అంశాలు ఎత్తకుండా నేరుగా “నా పార్టీకే ఓటేసి గెలిపించండని’ ప్రచారం చేసుకొని ఉంటే, ప్రజల కొంతయినా అతనిని నమ్మేవారేమో!

 

పట్టుమని మూడేళ్ళ రాజకీయ అనుభవం కూడాలేని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో తలపండిపోయి, దేశానికే అత్యునత పదవి అలంకరించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర విభజనపై పాటాలు భోదించడం అవివేకమా? లేక అతితెలివి ప్రదర్శించడమా? రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీలని కూడా తన వెనుక నడువమని కోరడం కూడా అటువంటిదే!

 

ప్రతిపక్ష పార్టీ నేతగా అతను రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరడం తప్పు కాదు, కానీ ఆ పని అతను ఇప్పటికే ఒకసారి పదిహేను రోజుల క్రిందటే చేసాడు. మళ్ళీ ఇంతలోనే మరో సారి డిల్లీవెళ్లి ఆయనను కలవాల్సిన అవసరం ఏమిటో? జాతీయ పార్టీలయినా లెఫ్ట్ పార్టీలతో సహా మరే ఇతర పార్టీ కూడా రాష్ట్రపతిని కలవాలని ఇంత అత్యుత్సాహం చూపలేదు. కానీ ఒక్క జగన్ మాత్రమే ఇన్నిసార్లు ఆయనని కలవడం విచిత్రమే.

 

లగడపాటి తమ పార్టీ అధిష్టానానికి జగన్ దత్తపుత్రుడు అని చెపుతుంటే, బహుశః అది తప్పని రుజువు చేయడానికో లేక మరి దేనికో అతను పనిగట్టుకొని కాంగ్రెసేతర పార్టీ నేతలని కలుస్తూ మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అదే పార్టీకి చెందిన మరో నేత వీ.హనుమంతరావు అసలు అతని దేశాటనల వెనుక వేరే ఉద్దేశ్యాలున్నాయని చెప్పడమే కాకుండా, కోర్టులు అతనిని నియత్రించాలని కోరడం విశేషం.

 

అంటే ఈ ‘జగన్మాయని’ ఎవరూ కూడా కనిపెట్టలేరని అర్ధం అవుతోంది. ఇటువంటి విచిత్రమయిన, అనుమానస్పదమయిన వ్యవహార శైలి ఉన్నవ్యక్తి తెల్లారి లేస్తే నీతి, నిజాయితీలు తన లోటస్ పాండ్ పెరట్లో చెట్లకు పూస్తునట్లు జనాల ముందు వెదజల్లడం మాత్రం మరిచిపోరు.