బెయిలు షరతులు సడలింపుకు జగన్ కొత్త ఎత్తు

 

హైదరాబాద్ విడిచి బయటకు వెళ్ళరాదనే షరతుకి అంగీకరిస్తూ రెండు వారల క్రితం బెయిలుపై జైలు నుండి విడుదల అయ్యి బయటకు వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ షరతుని అదిగమించేందుకు ఇప్పుడు సరికొత్త ఎత్తు వేసారు. రాష్ట్రంలో నెలకొన్నఅనిశ్చిత పరిస్థితికి ప్రజలు చాలా ఆందోళన చెందు తున్నారని, ఇటువంటి సమయంలో బాధ్యతగల ఒక ప్రజాప్రతినిధిగా వారికి బాసటగా నిలవడం తన కర్తవ్యమని, అందువల్ల బెయిలు షరతులు సడలించి తనకు రాష్ట్రంలో పర్యటించేందుకు గాను అనుమతించాలని కోరుతూ ఆయన ఈ రోజు సీబీఐ కోర్టులో ఒక పిటిషను వేసారు.

 

ఆ వాదన ఎలా ఉందంటే ఆయన వచ్చి ప్రజలను ఓదార్చకపోతే వారు అలా బాధపడుతూనే ఉంటారన్నట్లుంది. ఒకవైపు కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియ చేసుకుపోతుంటే, ఆయన నిరాహార దీక్షలు చేయడం, సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమాలు నడపడం కేవలం తన పార్టీని బలపరుచుకోవడానికేనని ప్రజలకి తెలుసు. ఆ క్రమంలోనే ఆయన పార్టీలోకి కాంగ్రెస్ శాసన సభ్యులు, యంపీలు వరుసకట్టి వస్తున్నారు.

 

సాధారణ ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం మిగిలినందున, ఆయన ఇప్పుడు తన పార్టీని బలపరుచుకోవడానికి సీమంద్రా పర్యటనకి బయలుదేరాలనుకొంటున్నారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణాలు మాత్రం వేరే విదంగా ఉన్నాయి.

 

తను చాలా బాధ్యత గల ప్రజాప్రనిధినని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ఎలాగు సమైక్యంద్రానే కోరుకొంటున్నారు గనుక, ముందుగా తెలంగాణాలో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకొని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని తీవ్ర భయాందోళనలు చెందుతున్న తెలంగాణా ప్రజలను ముందుగా ఓదార్చితే బాగుటుంది. కానీ కేవలం సీమంద్రాలో ప్రజలనే ఓడార్చాలనుకొంటే, ఆ మిషతో పార్టీని బలపరచుకొనే ప్రయత్నంగానే భావించవలసి ఉంటుంది.