జగన్ ఉద్యోగ దీక్ష

 

సీమంద్రాలో ప్రజలు పార్టీల వారిగా చీలి ఉన్నపటికీ, సమైక్యాంధ్ర కోసం అంతా ఒక్క త్రాటిపైకి వచ్చిమూడు ప్రధాన పార్టీలను సమదూరంలో ఉంచుతూ ఉద్యమిస్తున్నారు. వారికి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో వైకాపా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సమ్మె కాలానికి జీతంతో మరియు బోనస్ కూడా ఇస్తామని ఎర వేయజూసినప్పటికీ ఉద్యోగులు దానిని నిర్ద్వందంగా తిరస్కరించి ఉద్యమంపట్ల తమ నిబద్దతను చాటుకొన్నారు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే హైదరాబాదులో ‘సమైక్యశంఖారవం’ సభ వ్యూహంతో ఆయన వారిలో చీలికలు సృష్టించగలిగారు. ఆయన ఉద్యోగ సంఘాల నేతలను “మీరు సమైక్యాంధ్ర కోరుతూ లేఖవ్రాసి తెస్తే తొలి సంతకం చేస్తా”నని చెప్పడం ద్వారా, వారు ఏమిచేయాలో నిర్దేశిస్తున్నపుడే, సమైక్య ఉద్యమాన్నితన చేతులోకి తీసుకోవాలనే ఆయన మనసులో ఆలోచనలు బయటపడ్డాయి.

 

సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం రాష్ట్రవిభజన ఖరారు చేసి ఆయనకు మరో గొప్ప అస్త్రం అందించడంతో, నేటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొవడం ద్వారా సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులను పూర్తిగా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయబోతున్నారు. ఆయన దీక్షవల్ల కేంద్రం తన నిర్ణయం ఉపసంహరించుకోకపోయినా, ఉద్యోగులను తనవైపు తిప్పుకోవాలనే ఆయన లక్ష్యం మాత్రం నెరవేరవచ్చును.

 

తనకు కష్టకాలంలో అండగా నిలచిన వ్యక్తులను (సబ్బం హరి, మహేందర్ రెడ్డి, కొండ సురేఖ తదితరులు) అవలీలగా వదుల్చుకొన్న జగన్మోహన్ రెడ్డి, రేపు ఉద్యోగులతో కూడా ఏవిధంగా ప్రవర్తించవచ్చో చూచాయగా అర్ధం అవుతోంది.