పెద్ద బాస్ బాధ్యతను చిన్న బాస్ తీసుకున్నాడా..?
Published on: Thu Apr 5, 2018 12:18PM

వైసీపీ అధినేత జగన్ బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నారా..? జగన్ తరపున పవన్ వకాల్తా పుచ్చుకున్నారా..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న కామెంట్లు ఇవే. జగన్ బాధ్యత ఏంటీ.. పవన్ తీసుకోవడం ఏంటీ.. అసలు ఇంతకీ అంత పెద్ద బాధ్యత ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? అదేనండీ జగన్ చేస్తున్న పాదయాత్ర. ప్రతి శుక్రవారం జగన్ కు హాలీడే అని తెలుసుకదా. అక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతిశుక్రవారం జగన్ కోర్టుకు వెళ్లాలి కదా. అందుకే ప్రతి శుక్రవారం పాదయాత్రకు సెలవు.
దీంతో రేపు జగన్ కోర్టుకెళ్తుంటే... పవన్ పాదయాత్ర చేస్తున్నారని అనుకుంటున్నారు ఏపీ జనాలు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. పవన్ 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని పవన్ ప్రకటించారు. జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని.. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. దీంతో ఈ విషయంపై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుటికే జగన్, పవన్ ఇద్దరూ కలిసిపోయారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెద్ద బాస్ కోర్టుకు వెళితే.. ఇటీవలే పార్టనర్ అయిన చిన్న బాస్ పాదయాత్ర చేస్తున్నారని.. అదీ పార్టనర్స్ అంటే.. అలాగే ఉండాలి. అలాగే కలసి రావాలి అని సెటైర్లు వేసుకుంటున్నారు.
అంతేకాదు.. జగన్ పాదయాత్రలో ఆయన ఏ ఊరుకి వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడం... ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని.. విభజన హామీలు నెరవేర్చాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాత్రం పల్లెత్తుమాట అనరు. ఈయనకు పార్టనర్ గా ఇప్పుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తయారయ్యారు. ఈయన కూడా మోదీనీ కానీ బీజేపీని కాని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ రోజూ పాదయాత్రలో జగన్ రాళ్లు వేస్తూంటారు. ఈ శుక్రవారం కోర్టుకు వెళ్లాలి కాబట్టి.. ఈ వారం ఆ బాధ్యతను పవన్ కల్యాణ్ కు అప్పగించారు అని... విజయవాడలో ఒక రోజు పాదయాత్ర చేసి… జగన్ మిగిల్చిన రాళ్లను…చంద్రబాబుపై వేయనున్నారు అని అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం ఏమో కానీ... చూడబోతే అది నిజంలాగే కనిపిస్తోంది. లేకపోతే ఒక్కరోజు పాదయాత్ర ఏంటీ మరీ విడ్డూరం కాకపోతే. ఇంతమంది ఇన్ని రోజులుగా పోరాటం చేస్తుంటే... పవన్ ఒక్కరోజు పాదయాత్ర చేసి మోడీగారి మెడలు వంచుతారట.. వినేవాడు వుంటే..చెప్పేవాడు ఏదైనా చెబుతాడంట అలా ఉంది...


