రేపు జగన్‌కి ఇలాగే జరుగుతుందా..?

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో.. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. పాటియాలలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ తీర్పుతో దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపై మళ్లీ సరికొత్త వాదనలు తెరమీదకు వచ్చాయి. 2010లో అప్పటి కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా డీఎంకే నేత ఎ.రాజా వ్యవహరించారు. ఆ సమయంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆరోపించింది. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.

 

కాగ్ ఆరోపణలతో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాజాని పదవి నుంచి తప్పించింది. సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగి.. రాజా, కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పోరేట్ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్ నమోదు చేశాయి. రాజాను అరెస్ట్ చేసినప్పటికీ.. ఏడాది తర్వాత బెయిల్‌ తెచ్చుకుని విడుదలయ్యారు. కానీ ఇన్ని రోజుల తర్వాత తుదితీర్పు వెలువడుతున్నట్లు మీడియాలో రావడంతో.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.. ఎందుకంటే వీరందరిని నేరం చేసినట్లుగా కాకుండా.. దేశ సంపదను దోచుకున్న వారిగానే జనం చూశారు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి.. కోర్టు కూడా కఠిన శిక్షలను ఖరారు చేస్తుందని అంతా అనుకున్నారు..

 

కానీ అనూహ్యంగా.. ఆశ్యర్యకరంగా.. మొత్తం 17 మంది నిర్దోషులే అని ప్రకటించడంతో దేశం ముక్కున వేలేసుకుంది. ఈ నాటకీయ పరిణామాలు భారత న్యాయవ్యవస్థకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. డబ్బు, పరపతి ఉన్నవారికి ఈ దేశంలో చట్టం తలవంచాల్సిందేనా.. వీరు చట్టాలకు అతీతులా అంటూ.. మేధావి వర్గంతో పాటు సోషల్ మీడియాలో యువత కూడా ఈ తీర్పుపై స్పందిస్తోంది. మరోవైపు ఈ తీర్పు వెనుక చాలా రాజకీయ కోణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. తమిళనాట పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. కానీ అన్నాడీఎంకే, డీఎంకేల ప్రాంతీయ బలం ముందు కమలం ఆటలు సాగలేదు. కానీ జయ మరణంతో ఏఐఏడీఎంకే బలహీనం అయిపోయింది.. ఇక డీఎంకే ఒక్కటే. దానిని మేనేజ్ చేయలగలిగితే తమిళనాడులో లాంఛనంగా అడుగుపెట్టవచ్చని బీజేపీ పెద్దలు వ్యూహం రచించారు.

 

దీనిలో భాగంగానే అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని పరామర్శించారు ప్రధాని నరేంద్రమోడీ. ఆ తర్వాత కొద్దిరోజులకే 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో డీఎంకే నేతలు నిర్దోషులుగా విడుదలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకరితో ఒకరికి ఉన్న రాజకీయ అవసరాలు చట్టానికి అతీతమైనవా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలుస్తుంది అనుకుంటే జగన్‌ను చేరదీసి.. అవినీతి కేసుల నుంచి ఆయన్ను కూడా ఇలాగే బయట పడేస్తారా..? అంటున్నారు నిపుణులు. ఏమో రాజకీయం ఏమైనా చేయించగలదు. ఇలా జరిగితే చట్టం ముందు అందరు సమానులే అన్న మాటకు.. విలువే లేకుండా పోతుంది అని ప్రజాస్వామ్య వాదుల ప్రశ్న.