జీవితంలో తొలిసారి మాటపడ్డ రాజమౌళి..!!

 

తన మానాన తాను ఏడాదికో.. రెండేళ్లకో సినిమాలు తీసుకుంటూ కాలం వెల్లదీస్తూ.. దక్షిణ భారతదేశంలో స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. ఎవరితో విభేదాలు లేకుండా.. అందరితో కలివిడిగా ఉంటూ.. చిన్న సినిమా.. పెద్ద సినిమా అన్న తేడా లేకుండా సినిమా బాగుంటే బాగుందని.. లేదంటే లేదని చెబుతారు జక్కన్న. ఇన్నేళ్ల కెరీర్‌లో ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గానీ ఒక్క మాట పడి వుండడు. అలాంటి వ్యక్తిపై తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి.. అది కూడా ఆయన ఫీల్డ్‌కి ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ రంగం నుంచి. కాళ్లు బొబ్బలెక్కినా.. నడుముకి బెల్ట్ వచ్చినా మడమ తిప్పక తన పాదయాత్రను జోరుగా సాగిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. తన యాత్రకు వచ్చే వారి బుగ్గ నిమురుతూ.. నుదిటిపై ముద్దు పెడుతూ.. మధ్య మధ్యలో అధికార పక్షం అవినీతిపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రతిపక్షనేత.

 

తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేశారు జగన్. సీఎం గారు రాష్ట్రానికి చేసిందేమి లేదని.. ఆయన ప్రజలను చాలా మోసం చేశారని చెబుతూ.. తన మాటలను జనాలు నమ్మరేమోనని సినీ దర్శకులను, హీరోలను పక్కనబెట్టుకొని తిరుగుతున్నారని కామెంట్స్ చేస్తూ సీన్‌లోకి రాజమౌళిని కూడా లాగారు. ఒకాయన బాహుబలి సినిమాను తీశారు.. మీరందరూ కూడా చూసే ఉంటారు. నేను కూడా పేపర్లో చదివాను.. ఆయనను ముఖ్యమంత్రిగారు పిలిపించుకొని అమరావతి మీద సినిమా తీయండి అని అడిగారట..

 

ఒక్క ఇటుక కూడా పడని అమరావతిలో సినిమా ఏంటా అని నేను ఆశ్చర్యపోయా.. ఇక రేపు పొద్దున్న ఆయన సెట్లు వేసేస్తాడు.. ఆ సెట్లలో చంద్రబాబు గారి ఎంట్రీ.. ఆయన మంత్రి నారాయణ మరో పాత్ర.. ఇదిగో అమరావతి.. అదిగో వచ్చేసింది అని బిల్డప్ ఇస్తారు. మోసానికైనా హద్దు పొద్దు ఉండాలి అంటూ.. జగన్ వేసిన సెటైర్లు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ముఖ్యమంత్రి ...ఇందుకు రాజమౌళి సలహాలు కోరారు. సీఎం అంతటి వ్యక్తి అడిగే సరికి జక్కన్న కూడా కాదనలేకపోయారు. భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా కొన్ని సూచనలు చేసి.. ఆ డిజైన్లకు చంద్రబాబు చేత ఓకే అనిపించారు. ఇంత చేసినా తన సాయం రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటిదని చెప్పాడు. అలాంటి రాజమౌళిపై జగన్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతికి సంబంధించి తన పాత్ర ఎంత పరిమితమో చెప్పాక కూడా.. వైసీపీ అధినేత ఇలా అనడంపై రాజమౌళి ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతోందట.