జగన్‌ని మానసికంగా దెబ్బ కొట్టిన గుర్నాథరెడ్డి


జీవితంలో ఎవరిని పొగొట్టుకున్నా.. ఎంతమంది మనల్ని కాదని వెళ్లిపోయినా మనల్ని బాగా అభిమానించే వారిని.. కష్టాలలో మన వెంట నడిచిని వారిని మాత్రం దూరం చేసుకోకూడదు అంటారు మన పెద్దలు. కానీ వైసీపీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు మాత్రం ఈ సూక్తిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం లేకపోలేదు.. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత గుర్నాథరెడ్డి పార్టీని విడిచి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందులో ఏముంది ఇంతకు ముందు వైసీపీ నుంచి గెలిచిన వారు, గెలవని వారు ఎంతోమంది సైకిలెక్కారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వీరిలో గుర్నాథరెడ్డి వ్యవహారం వేరు. తొలి నుంచి వీరి కుటుంబంలో అంతా కాంగ్రెస్‌వాదులే.. గుర్నాథరెడ్డి అన్న నారాయణరెడ్డి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌కు వీరాభిమాని. ఆయన అండదండలతో 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనారోగ్యంతో అన్నయ్య రాజకీయాలకు దూరం కావడంతో గుర్నాథరెడ్డి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

అయితే 2009లో హైలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది ఎమ్మల్యేలు జగన్‌ని సీఎం చేయాల్సిందిగా హైకమాండ్‌ను కోరారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకున్నారు. నాడు అధికారంలో ఉన్న పార్టీని.. అన్నని కాదని జగన్ వెంట నడిచాడు గుర్నాథరెడ్డి. నా కోసం రాజీనామా చేస్తావా అంటే.. చేస్తానన్న అంటూ అడుగు ముందుకేసి రాజీనామా చేశారు గుర్నాథం. జగన్ మీద నమ్మకంతో ఇంత డేర్ స్టెప్ వేసిన నాయకుడు అప్పట్లో మరొకరు లేరు అంటారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడే కాదు అధినేత ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. కార్యకర్తలను, నేతలను ముందుండి నడిపించారు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ వెన్నంటే ఉన్నారు. అలాంటి వ్యక్తికి రాను రాను పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. అనంతపురం టికెట్‌ను ఆయనను కాదని మైనారిటీ నేత నదీంకు ఇస్తున్నట్లు స్వయంగా జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన గుర్నాథరెడ్డి తనకు ఆదరణ లేని పార్టీలో ఉండటం కన్నా వైదొలగడమే మంచిదని భావించారట.

 

ఇదే సమయంలో జేసీ, పరిటాల కుటుంబాలతో సత్సంబంధాలు ఉండటంతో.. వారి సూచన మేరకు ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామం జగన్ విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. తొలి నుంచి వెంట నడిచిన గుర్నాథరెడ్డి లాంటి వాళ్లనే పక్కనబెడితే రేపు మా పరిస్థితి ఏంటనే టెన్షన్ వైసీపీ నేతలను కుదిపేస్తోందట. మరి గుర్నాథాన్ని టీడీపీలోకి వెళ్లకుండా బుజ్జగిస్తారా లేక "వెళితే వెళ్లాడు లే" అన్న ధీమాతో ఉంటారా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.