జగన్ గురించి వైసీపీ క్యాడర్ ఇలా అనుకుంటోందట!

 

ఏపీ రాజకీయాల్లో మొన్నటి వరకూ ఒకే పీకే వుండేవాడు. అతనే పవన్ కళ్యాణ్. కాని, ఇప్పుడు జగన్ శిబిరంలోనూ ఓ పీకే చేరాడు. అతనే ప్రశాంత్ కిషోర్! 2014లో మోదీని, తరువాత బీహార్ లో నితీష్ ని గెలిపించాడని ఈ పీకేకి బోలెడు పేరు! అయితే, అదే ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్నటి యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కాపాడలేకపోయాడు. గెలిపించటం మాట అటుంచీ … కనీసం ఇండిపెండెంట్లు గెలిచినన్నీ సీట్లు కూడా రాహుల్ గాంధీకి సంపాదించి పెట్టలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆంధ్రాలో కాలుమోపిన ఈ ఉత్తరాది పీకే జగన్ కోసం సర్వేలు చేస్తే హడావిడి చేస్తున్నారు!

 

వైసీపీని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిపించి తీరాలని ప్రశాంత్ అవిశ్రాంతంగా కృషి చే్స్తున్నాడు. అందుకు కోసమే ఏపీలో ఊరూరూ, వాడ వాడా తిరుగుతున్నాడు. స్వయంగా వైసీపీ కార్యకర్తల్ని కూడా కలుసుకుని క్షేత్ర స్థాయి స్థితిగతుల్ని అంచనవేస్తున్నాడు. ఇదంతా చక్కటి ఎక్సైజే! మంచి అవగాహన కలుగుతుంది పార్టీ పొజీషన్ మీద. కాని, సర్వేకు వెళ్లిన పీకే టీమ్ కి ఓ షాక్ ఎదురైందట కార్యకర్తల వద్ద!

 

సర్వేలో భాగంగా సహజంగానే చంద్రబాబు గురించి ప్రశ్నించాడు పీకే. వైసీపీ కార్యకర్తలు ఆయన బాగానే కష్టపడుతున్నాడని చెప్పారట. మరి జగన్ సంగతేంటని అడిగితే… వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పెదవి విరిచారట. ఆయన టీడీపీపై ప్రజల్లో వున్న అసంతృప్తిని సరిగ్గా వాడుకోలేకపోతున్నారని అన్నారట! ఇందుకు కారణం జగన్ వ్యవహార శైలేనని చెప్పారట. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్బుతం చేయదలుచుకుంటే మరింతగా జనంలో వుండాలని వారు అంటున్నారట. అంతేకాక పార్టీ కోసం పని చేసే కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని అన్నారట. వారికి అందుబాటులో వుండాలని కూడా కోరుకున్నారట!

 

ఏ పార్టీకైనా డబ్బు సంచులు తీసుకొచ్చే స్పాన్సర్లు, బడా నాయకులే ప్రధానం. కాని, వాళ్లతో బాటూ కార్యకర్తలు రాత్రింబవళ్లు నమ్మకంతో కష్టపడకపోతే ఏ పార్టీ కూడా నిలవదు. ఇది చరిత్ర చెప్పే సత్యం. మరి జగన్ ప్రశాంత్ కిషోర్ ద్వారా ఈ సత్యం తెలుసుకుంటాడో లేదో చూడాలి! కాని, ఒక్కటి మాత్రం నిజం… ఇదే ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య బీహార్లో నితీష్, లాలూ జోడీని సూపర్ గా గెలిపించాడు. కాని, ఇవాళ్ల ఆ పొత్తు పెటాకులైపోయింది. కాబట్టి పీకే ఎన్నికల వరకే వెంట వుంటాడు. జగన్ కు నిరంతరం కావాల్సింది స్వంత రాజకీయ వ్యూహం, కార్యకర్తల్లో విశ్వాసం. మరి జెండా మోసే సైనికుల్లో వున్నట్టుగా వినిపిస్తున్న అసంతృప్తిని జగన్ ఎలా శాంతిపజేస్తాడో చూడాలి…