ఆంధ్రా యువనేతని కాపాడేది… ఢిల్లీ పెద్దల ఆశీర్వాదాలేనా?

 

జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు! ఇందులో పెద్ద విశేషం ఏంటి అంటారా? కరెక్టే… ఎలాంటి విశేషం లేదు! కాకపోతే, ఒక్కోసారి ఒక్కో నెపంతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే యువనేత ఈసారి సేవ్ డెమోక్రసీ అంటూ బయలుదేరారు! వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వటం అప్రజాస్వామికం అని ఆయన గడప గడపకూ తిరిగి వాదిస్తున్నారు! వాపోతున్నారు! అయితే, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే… జగన్ మనసులో మాట సేవ్ డెమోక్రసీ కాదు! తనని తాను సేవ్ చేసుకోవటం!

 

జగన్ ఇలా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవటం, ఇతర పార్టీల వార్ని కలవటం, వీలైతే ప్రధానితోనూ మాట్లాడి రావటం… ఇదీ ఇప్పటి తతంగం కాదు. యూపీఏ హయాంలోనూ సేమ్ టూ సేమ్ జరిగేది. కాకపోతే అప్పుడు అక్కడ సోనియా తప్ప అందరి అనుగ్రహమూ లభించేది! ఇప్పుడేమో మోదీ దర్శనం కూడా దొరకటం లేదు! అంతే తేడా!

 

జగన్ కాంగ్రెస్ ను విడిచి బయటకొచ్చిన రోజు నుంచీ ఆయనకున్న ఏకైక టెన్షన్ కేసులు! ఏ క్షణాన నోటిసులు వస్తాయో తెలియదు. ఏ క్షణాన ఆస్తులు జప్తు అవుతాయో అర్థం కాదు. ఇక ఇప్పుడైతే ఏ నిమిషం బెయిల్ రద్దు అవుతుందోనన్న భయం! ఇదీ పరిస్థితి. దీనికి ఉపశమనంగానే జగన్ ఢిల్లీ వెళ్లి వస్తుంటారు! మనసు బాగాలేనప్పుడు వాతావరణ మార్పు కోసం కొత్త ఊరు వెళ్లినట్టు ఆయన దేశ రాజధాని ఎంచుకున్నారు! పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని తిరిగి వస్తుంటారు. కాని, ఒక్కసారి రాష్ట్రంలో కాలుపెట్టాక మాత్రం మళ్లీ పాత సీనే! టీడీపీ వాళ్ల భీభత్సమైన దాడితో రాజకీయంగా చిరాకు, కోర్టు వ్యవహారాల కారణంగా లీగల్ టెన్షన్….

 

జగన్ రాష్ట్రపతిని కలిసి మోదీతో కూడా భేటీ కావాలని ప్రయత్నిస్తున్నారట. 2014లో బీజేపికి జై కొట్టిన పవన్ ఇప్పుడు ఏకు మేకయ్యాడు కాబట్టి జగన్ తనని అక్కున చేర్చుకోమని కోరనున్నట్టు టాక్. కాని, కొంత మంది విశ్లేషకులు మాత్రం బీజేపి వైసీపీని విలీనం చేయమంటోందని అంటున్నారు. అలా చేస్తే జగన్ భవిష్యత్ మరింత అంధకారమయం అయ్యే సూచనలే ఎక్కువ. అందుకే, ఎలాగైనా పార్టీని కాపాడుకుంటూ బీజేపితో దోస్తి చేయాలని జగన్ తాపత్రయపడుతున్నారట! కాని, ఏపీలో ఆల్రెడీ టీడీపీతో పొత్తులో వున్న కమల దళం జగన్ తో జోడీ కట్టే రిస్క్ ఎందుకు చేస్తుంది? పైగా జగన్ మద్దతు తీసుకుని అతడ్ని వెనకేసుకొస్తే అవినీతిని సమర్థించినట్టు చెడ్డపేరు కూడా తప్పదు!

 

బీజేపీ, మోదీల అనుగ్రహం జగన్ కి దక్కుతుందో లేదో… అలాగే, ఆయన ఎత్తుకున్న సేవ్ డెమోక్రసీ నినాదం నిలబడుతుందో లేదో…  ఏది ఏమైనా ఎన్నికల కంటే వేగంగా తరుముకొస్తున్న కోర్టు కేసులు మాత్రం జగన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నది నిజం! 2019 ఎలక్షన్స్ కంటే ముందే జైలు నుంచి పిలుపొస్తే… సేవ్ డెమోక్రసీ కంటే ఎక్కువగా అవసరమయ్యేది సేవ్ జగన్ నినాదం!