TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీపై జగన్ పట్టు జావగారిందా.. గడప గడపకూకు నేతల డుమ్మా అందుకేనా?

Published on: Fri May 20, 2022 7:08AM

పార్టీపై పార్టీ నేతలపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై జగన్ పట్టు జావగారిందన్న మాటలు వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మాయే ఇందుకు నిదర్శనమని వారే అంటున్నారు. సీఎం మాట ఇంతకు ముందులా శిలాశాసనంలా చెల్లుబాటు కావడం లేదని చెబుతున్నారు. మూడేళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు జగన్ చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం  ఒక్క సారిగా వైసీపీ బలహీనతలూ, జగన్ ప్రభుత్వ వైఫల్యాలనూ బట్టబయలు చేసేసింది. ఇప్పటి వరకూ జగన్ గుప్పిట మూసి ఉంచి.. పార్టీలో తానకు తిరుగే లేదనీ,తన మాటను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదని ఇచ్చిన బిల్డప్ గడప గడపకూ కార్యక్రమంలో పటాపంచలైపోయింది.

జనంలో వైసీపీ, జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయాయనడానికి గడప గడపకూ కార్యక్రమానికి ఎదురైన ప్రజా వ్యతిరేకతే తార్కానమని పరిశీలకులు అంటున్నారు.  గడప గడపకూ  మంత్రులు, ఎమ్మెల్యేలను వెళ్లి జనానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ వైఫల్యాలపై జనం ఆగ్రహ జ్వాలలు వైసీపీ నేతలకు చమట్లు పట్టించాయి. మూడేళ్ళుగా ఎమ్మెల్యేలు, మంత్రులను డమ్మీలను చేసి వాలంటీర్లకే పెత్తనం అంతా అప్పగించిన ఫలం ఇప్పుడు గడప గడపకూ కార్యక్రమంలో ప్రజాగ్రహ రూపంలో ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నది.  ఇదే గడప గడపకూ కార్యక్రమం జగన్ కు పార్టీ నేతలపై పట్టు సడలిందన్నవిషయాన్ని కూడా తేటతెల్లం చేసింది. గడప గడపకూ తొలి రోజు వైఫల్యం తరువాత జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు విస్పష్ట ఆదేశాలిచ్చినా కూడా వారు ఖాతరు చేయలేదు. అక్కడక్కడా మమ అన్నట్లుగా మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

సీఎం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజాగ్రహంతో నిలిచిపోయింది. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, ఇతర ముఖ్య నేతలూ అసలీ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా వెళ్లిన వారికి ప్రజా నిరసనలు ఎదురై వెనుదిరిగేలా చేస్తున్నాయి.  రోడ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు,రేషన్, అమ్మఒడి తదితర సమస్యలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడుతుండటంతో ప్రభుత్వ అధికారులు, వలంటీర్లు హాజరై మమ అనిపించేస్తున్నారు. అసలు గడప గడపకూ వైసీపీ పేర ఈ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే  పలువురు ప్రజా ప్రతినిథులు కోరడంతో దానిని వాయిదాల మీద వాయిదా వేస్తూ వచ్చారు. ఎలాగోలా ఈ నెలలో కార్యక్రమం పేరును గడప గడపకూ మన ప్రభుత్వం పేర చేపట్టి అధికారులను కవచంగా చేసుకుని మమ అనిపిద్దామని జగన్  చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడప గడపకూ వెళ్లి ప్రజాదరణ పొందితే తప్ప మళ్లీ అధికారంలోనికి రాలేమని.. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు కాలేరని జగన్  హెచ్చరిస్తున్నా  ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. 

గురువారం కోనసీమలో గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ఎదురైన అనుభవం మరెవరూ ఇక ఈ కార్యక్రమం జోలికి వేళ్లే ధైర్యం చేయకుండా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజల ప్రశ్నాస్త్రా తట్టుకోలేక తప్పించుకు వెళుతున్న ఎమ్మెల్యేలను వెంబడించి మరీ జనం నిలదీస్తున్నారు. పథకాల అమలులో లొసుగులు, అభివృద్ధి జాడే లేని పాలనపై జనాగ్రహం ఉవ్వెత్తున లేస్తుంటే ప్రజా ప్రతినిధులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ప్రశ్నిస్తున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులను రంగంలోకి దింపి ప్రజా ప్రతినిథులు జారుకుంటున్న పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా కనిపించింది.

  ఆఖరికి  రైతు భరోసా కార్యక్రమానికి కూడా పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటే జగన్ ఆదేశాలకు  గతంలోలా పార్టీలో ఖాతరీ లేదని తేటతెల్లమౌతోంది. లబ్ధిదారుల ఎంపికలో తమ మాటకు విలువ లేనప్పుడు పాల్గొని ప్రయోజనం ఏమిటని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.  అనంతపురం జిల్లాలో రైతు భరోసా కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.   చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆర్‌కే రోజా హాజరు కాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి హాజరైనా  సమావేశాన్ని త్వరగా ముగించేసి మమ అనిపించారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాత్రమే హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో పాలకపక్ష ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు.

కాకినాడ జిల్లా కేంద్రం బదులు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దొరబాబు మాత్రమే వచ్చారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.   శ్రీసత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి తప్ప మిగిలినవారెవరూ రాలేదు. వైఎ్‌సఆర్‌ జిల్లాలో జగన్‌ మేనమామ నియోజకవర్గమైన కమలాపురంలో కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సుధ, రాచమల్లు ప్రసాదరెడ్డి హాజరు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని సింగంపల్లిలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, కలెక్టరు మాత్రమే హాజరయ్యారు. జిల్లా మంత్రి తానేటి వనిత, ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు.

కోనసీమ జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ చింతా అనూరాధ హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌, నలుగురు ఎమ్మెల్యేలురాలేదు. పార్టీలో జగన్ మాట గతంలోలా చెల్లుబాటు కావడం లేదనడానికి ఇదే తార్కానంగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.