సిబిఐపై ఒత్తిడి తెస్తున్న వైయస్సార్ కాంగ్రెస్
Published on: Sat Mar 10, 2012 12:14PM
హై
దరాబాద్: జగన్ అరెస్ట్ కు జాప్యం చేసే వ్యూహంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిబిఐపై తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. దీనిలో భాగంగా ప్రజాందోళలనలకు సిద్దమవుతుంది. గురువారంనాడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో జగన్ కు సంఘీభావంగా సిబిఐకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. గతంలో జగన్ ఎమ్మార్ విల్లాల కుంభకోణం విచారణ సందర్భంగా సిబిఐ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అనుచరులు హైదరాబాద్ లో సిబిఐ ఆఫీస్ ఎదుట వీరంగం సృష్టించారు. దీనికి తగ్గట్టుగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల స్వరం కూడా తీవ్రస్థాయికి చేరుకుంది. నిన్న మొన్నటి దాకా సిబిఐ విచారణను శంకించిన నాయకులు ఇప్పుడు ఆ సంస్థ జగన్ ను అరెస్ట్ చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. సిబిఐకి దమ్ము, ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోవాలని సవాలు విసురుతున్నారు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు తగలడంతో ఇదే సరైన సమయంగా భావించిన వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఒకవైపు సిబిఐని ధిక్కరిస్తూనే మరోవైపు జగన్ ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నారు. అయితే సిబిఐ వ్యూహం మరోలా ఉన్నట్లు తెలిసింది. వెంటనే జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు జరగవచ్చని అందువల్ల ముందు జగన్ ను కాకుండా ఆయన భార్య భారతిని ఇంటరాగెట్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఎన్నికల ఫలితాల నేపధ్యంలో సిబిఐ కూడా తమ దూకుడును కాస్త తగ్గించే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.


