TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ మావిగన్ బూమరాంగ్.. సొంత పార్టీలోనే వ్యతిరేకత

Published on: Tue Apr 14, 2026 5:05PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి అగ్నిగుండంగా మారింది.  మాజీ సీఎం జగన్  తాజాగా తెరపైకి తెచ్చిన  మావిగన్  (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన  పెను సంచలనానికి దారితీసింది. అయితే, ఈ ప్రతిపాదన పట్ల జనం నుంచి ఇసుమంతైనా సానుకూలత వ్యక్తం కాలేదు. సానుకూలత సంగతి అటుంచి, ప్రతికూలత తీవ్ర స్థాయిలో వ్యక్తం అయ్యింది. జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ క్రమంలోనే ముగ్గురు మాజీ మంత్రులు జగన్ తీరును తప్పుబడుతూ గళమెత్తడం పార్టీ అసంతృప్తి, అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసిందంటున్నారు పరిశీలకులు. 

జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏళ్ల తరబడి పోరాటం సాగుతుండగా, మళ్లీ కొత్త ప్రాంతాలను తెరపైకి తెచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నారంటూ జగన్ ను నిలదీస్తున్నారు.   క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం  ఈ ప్రాంతంలో పార్టీకి పుట్టగతులుండని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు, మాజీ మంత్రులు ఈ విషయంలో జగన్‌కు గట్టి హెచ్చరికలే జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఇలాంటి అంశాలను తాము సమర్థించలేమని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంటున్నారు.  గతంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే కేడర్ ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు  మావిగన్  అంటే ఇక ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  అమరావతికి చట్టబద్ధత వచ్చిన తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన వ్యూహాత్మక తప్పిదమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఈ నిర్ణయం ప్రజలను ఆకట్టుకోవడం అటుంచి.. వారిని పారట్ీకి మరింత దూరం చేస్తుందని అంటున్నారు.  ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ఈ ప్రతిపాదనపై అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి.  జగన్ మావిగన్  నినాదంతోనే ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకతే కాకుండా, పార్టీలో అసమ్మతి కూడా పీక్స్ కు చేరు అవకాశం ఉందని అంటున్నారు.