రాష్ట్ర విభజన కంటే.. జగన్ విధ్వంసం వల్లే ఎక్కువ నష్టం!
Published on: Thu Oct 10, 2024 11:33AM
.webp)
రాష్ట్ర పునర్విభజన కంటే జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. హస్తిన పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన బుధవారం (అక్టోబర్ 9)న ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విధ్వంసకారుడి చేతికి అధికారం వస్తే ఏం జరుగుతుందనడానికి ఏపీ ఒక కేస్ స్టడీగా మారిందనీ, భావి తరాలకు జగన్ ఐదేళ్ల పాలన ఒక ఉదాహరణగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. జగన్ హయాంలో అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడింది తానేనని చెప్పిన చంద్రబాబు, తనను తప్పుడు కేసులో అరెస్టు చేసి 53రోజులు జైల్లో ఉంచారనీ, తాను జైలులో ఉండగానే చంపాలని చూశారన్న ప్రచారం కూడా జరిగిందని గుర్తు చేశారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనుల వల్లే తెలంగాణ ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పిన ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ ను కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో పని చేశానన్నారు. అయితే 2019లో రాష్ట్రంలో అధికారం జగన్ చేతికి వెళ్లడంతో అంతకు ముందు తన హయంలో ఐదేళ్ల పాటు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ హయాంలో విధ్వంసం తప్ప వికాసం లేదన్నారు. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి అరాచక పాలన సాగించారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇప్పడు మళ్లీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనీ, జగన్ హయాంలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇందుకు కేంద్రం సాయం అవసరమని చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధే లక్ష్యంగా తన హస్తిన పర్యటనలో ప్రధాని సహా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు. విజన్‌తో సంస్కరణలు తేవచ్చన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమంగా తీసుకెళ్లాలన్నారు. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెడితే మరింత మెరుగైన అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రహదారుల నిర్మాణాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఒక్క రైల్వే రంగంలోనే ఏపీలో రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు. ఉత్తర భారతదేశంలో అహ్మదాబాద్ టూ ముంబాయ్ బుల్లెట్ ట్రైన్ రాబోతోందని, దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ రానున్నదని చంద్రబాబు వెల్లడించారు.
గ్రామీణ రహదారుల కోసం రూ. 62,500 వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కుసుమ్ కింద రైతులకు నేరుగా సోలార్ ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఇళ్లకూ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎన్డీయే కూటమిలో చేరింది రాష్ట్ర అవసరాలతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకేనని స్పష్టం చేశారు.


