TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ డీఎస్సీపై జగన్ వి నిరాధార ఆరోపణలు.. కుండబద్దలు కొట్టేసిన జడ శ్రావణ్.!

Published on: Tue Jul 28, 2026 4:12PM

ఏపీ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్  చేస్తున్న ఆరోపణలపై జై భీమ్ భారత్ పార్టీ అధినేత,  న్యాయవాది జడ శ్రావణ్ కుమార్  మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ప్రభుత్వంపై బురద చల్లడం వైసీపీకే నష్టమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి ముందు కనీస రుజువులు చూపించాలని సవాల్ విసిరారు.

కేంద్రంలో జరిగిన నీట్   పరీక్షా పత్రాల లీకేజీకి, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ నియామకాలకు చాలా వ్యత్యాసం ఉందన్న జడ శ్రవణ్ కుమార్, నీట్ విషయంలో పేపర్ లీకైనట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్వయంగా అంగీకరించిందనీ,   ఏపీ డీఎస్సీ విషయంలో కేవలం అనుమానాలు తప్ప ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొన్నారు.  హైకోర్టులో వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్‌ను కూడా ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. 

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క సరైన డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారనిఎద్దేవా చేసిన ఆయన.. . ఆ నాడు ఇచ్చిందల్లా 6 వేల ఒక వంద  పోస్టుల నోటిఫికేషన్ మాత్రమేననీ, అందులో కూడా 2వేల గిరిజన ప్రాంత పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా కలిపారని విమర్శించారు. దానికి నిరసనగా తాము హైకోర్టుకు వెళ్లి ఆ నిర్ణయాన్ని సవాలు చేసి, ఆ పోస్టులను మినహాయించేలా ఉత్తర్వులు తెచ్చామని గుర్తుచేశారు.

అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన 16 వేల పోస్టుల డీఎస్సీలోనూ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన 2వేల 800 పోస్టులను కలపడంపై తాము న్యాయపోరాటం చేస్తున్నామన్న జడ శ్రవణ్ కుమార్..  ఏ ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించడం తమ నైజమని, అయితే ఏ విమర్శ చేసినా ప్రాథమిక ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు.

ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు వైఎస్సార్‌సీపీకి ఉందని, అయితే ఆధారాలు లేకుండా మంత్రి రాజీనామా కోరడం కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అవుతుందని శ్రావణ్ కుమార్ ముగించారు. భవిష్యత్తులో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోకుండా ఉండాలంటే, గాలిలో ఆరోపణలు చేయడం మానుకొని ఆధారాలతో మాట్లాడాలని వైఎస్ జగన్‌కు హితవు పలికారు.

YS Jagan Mohan Reddy, Nara Lokesh DSC, AP DSC Recruitment, TeluguOne,  AP Politics