15 ఏళ్ల భారతీయ బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలానికి వెళ్లే క్రమంలో గాయపడిన తన తండ్రిని ఓ బాలిక సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఎందరో హృదయాలను కలచివేసింది. ఆ బాలిక సాహసానికి ప్రశంసల జల్లు కురిసేలా చేసింది. తాజాగా ఆ బాలికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ మేరకు ఇవాంక‌ ట్విట్టర్ లో స్పందిస్తూ.. 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని 7 రోజుల పాటు 1200 కి.మీ ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమని చెప్పాలంటూ కొనియాడారు. భారతీయ ప్రజల్లో​ ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈ బాలిక ద్వారా తనకు తెలిసిందని ప్రశంసించారు. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను కూడా ఆకర్షించిందంటూ ఇవాంక ట్వీట్‌ చేశారు.

బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన కూతురితో కలిసి నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు రావడంతో సొంతూరికి వెళ్లే క్రమంలో గాయపడ్డాడు. దీంతో తండ్రిని సైకిల్‌ ఎక్కించుకుని అతని కూతురు జ్యోతి సొంతూరికి వచ్చింది. హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించింది. మే 10న గురుగ్రామ్‌ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం.. మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది. 

15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమంటూ ఎందరో ఆమెని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా జ్యోతి కుమారిని ఆహ్వానించింది. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.