సెలవులు ఇవ్వటం లేదని.. ఐదుగురిని కాల్చేసి తనను తాను కాల్చుకున్న జవాను

 

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం.. జవాన్ల మధ్య ఘర్షణ చెలరేగింది. జవాన్ల మధ్య గొడవలో ఆరుగురు జవాన్ లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోని కడెనార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఐటిబిపి 45 బెటాలియన్ జవాన్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఐటిబిపి క్యాంప్ అటవీ ప్రాంతంలో ఉండటంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గాయపడ్డ జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్ లో రాయపూర్ ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.రెహమాన్ ఖాన్ అనే జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి జవాన్ల పైకి కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనలో రహమాన్ ఖాన్ సహా మరో ఐదుగురు జవాన్ లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సెలవు దొరకలేదనే కారణంతో తోటి జవాన్ల పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను రాయపూర్ ఆస్పత్రికి తరలించినట్టు అడిషినల్ ఐజీ దేబ్ నాథ్ వెల్లడించారు.ఈ విషయం పై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందని ఉన్నత అధికారులు వెల్లడించారు.