గడ్డం గ్యాంగ్ సంస్థపై ఐటీ రైడ్స్!.. 70 కోట్లు సీజ్!.. వైసీపీ పెద్దలు షేక్!
Published on: Thu Dec 30, 2021 10:51AM
కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ. స్థాపించి దాదాపు ఏడాది అవుతోంది. అంతలోనే ఆ కంపెనీపై ఐటీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. ఏకంగా 70కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పలు కీలక పత్రాలు సైతం ఐటీ సిబ్బంది సీజ్ చేశారని అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు ఏపీలో బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నాయకులకు షాకింగ్ న్యూస్‌గా మారిందని చెబుతున్నారు.
సమూహ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నట్టు పలు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ కంపెనీ కొందరు వైసీపీ పెద్దల బినామీ సంస్థ అని అంటున్నారు. సమూహ రియల్ ఎస్టేట్ సంస్థను గత ఏడాది మార్చి నెలాఖరున రిజిస్టర్ చేశారు. గడిచిన 20 నెలల్లో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు, వెంచర్లు ఏమీ లేవని తెలుస్తోంది. కానీ ఆ సంస్థలో 70 కోట్ల నగదు దొరకడం కలకలం రేపుతోంది. అనితా నేనా, అనురూప కుర్రా లు ఈ సంస్థకు డైరక్టర్లుగా ఉన్నారని అంటున్నారు.
సమూహా ప్రాజెక్ట్స్ సంస్థ ఓ వైసీపీ మంత్రికి చెందినదిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పెద్ద సార్‌కు బినామీగానా? లేక, మంత్రిగారే సొంతంగా పోగేసుకున్న సొమ్మా? అనేది మాత్రం క్లారిటీ లేదు. గడ్డం గ్యాంగ్ అక్రమ లావాదేవీల డబ్బుతోనే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పురుడుపోసుకుందని.. ఇది మరో సూట్‌కేస్ కంపెనీ అనే ఆరోపణలు వస్తున్నాయి. నల్లధనాన్ని వైట్‌గా మార్చడంలో ఆరితేరిన కొందరి డైరెక్షన్‌లో, గత అనుభవాలతో మరింత రాటుదేలి.. ఈసారి పక్కాగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అయినా.. ఐటీ అధికారుల దృష్టికి ఆ సంస్థ యవ్వారం రావడంతో.. దాడులు చేయగా.. లెక్కల్లో లేని 70కోట్ల క్యాష్ లభించిందని అంటున్నారు. ఇదంతా వైసీపీ ప్రముఖుల నల్లధనమే..నా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమ సంస్థపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని.. సమూహ ప్రాజెక్ట్స్ సీఈవో ఓ ప్రకటన రిలీజ్ చేయడం కొసమెరుపు.


