బెంగళూరులో ఐటీ దాడులు ఎవరిపని..?

రెండు రోజుల క్రితం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ శివకుమార్, ఆయన సోదరుడితో పాటు బెంగళూరులోని ఓ రిసార్టుపైనా దాడులు నిర్వహించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఈ సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. శివకుమార్‌కు చెందిన మొత్తం 39 ప్రాంతాలపై దాదాపు 300 మంది సిబ్బంది నేటీకి నిర్విరామంగా సోదాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.11.43 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాట్లు ప్రకటించారు. శివకుమార్, ఆయన సోదరుడి ఇంటిపై దాడులు జరిగి ఉంటే ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదేమో..కానీ ఓ రిసార్టులో సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహాలను రచిస్తోంది.

 

ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా..వారిలో ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ మిగిలిన 44 మందిని కాపాడుకునేందుకు తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకు తరలించింది. ఇక్కడే కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహారించింది. తమకునన అధికారాలతో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌పై ఐటీ దాడి చేయించింది. డైరెక్ట్‌గా దాడులు నిర్వహిస్తే లేని పోని చిక్కుల్లో పడతామని ఊహించారో ఏమో కానీ..ఈ ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి శివకుమార్ ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై దాడి చేయించింది. తమ ఎమ్మెల్యేలను భయపెట్టేందుకే బీజేపీ ఐటీ దాడులు చేయించిందని కాంగ్రెస్ పార్లమెంట్ సాక్షిగా నిలదీసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చిందన్న ఆధారాలతోనే తాము సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.

 

అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోడీలే ఈ దాడుల వెనుక ఉన్నారని అంతా భావిస్తున్న వేళ..శివకుమార్ తల్లి బాంబు పేల్చారు. నా కొడుకు ఇంటీపై ఐటీ అధికారులు సోదాలు చేయడం వెనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉందంటూ ఆయన తల్లి గౌరమ్మ ఆరోపించారు. నా కుమారుడికి రాజకీయంగా ఎంతోమంది శత్రువులు ఉన్నారు..వారిలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారని...ముఖ్యంగా సీఎం నా బిడ్డ పట్ల ముందు నుంచి వ్యతిరేకంగా ఉంటున్నారు. నా కొడుకు ఎదుగుదలను చూసి ఓర్వేలేక ఐటీ దాడులు చేయించారన్నారు. ఎన్నో పనులకు శివను ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి..ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బెంగళూరుతో పాటు ఢిల్లీలోనూ కలకలం రేపాయి.

 

సొంత పార్టీ వ్యక్తి మీద దాడులు చేయించాల్సిన అవసరం సిద్ధూకి ఏముంటుందని..అయినా ఆదాయపు పన్ను శాఖ ప్రధాని అజమాయిషీలో పని చేస్తుంది కానీ ముఖ్యమంత్రుల మాట అది వింటుందా అని కాంగ్రెస్ మద్ధతుదారులు అంటున్నారు. అయితే శివకుమార్ తల్లిని, ఆయన కుటుంబాన్ని ఎవరో బెదిరించి ఉంటారని..వారి బెదిరింపులకు భయపడే మంత్రి కుటుంబం అలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కన్నడ నాట పుకార్లు షికారు చేస్తున్నాయి. గుజరాత్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కన్నడ నాట కుంపట్లు రాజేశారని కొందరు అంటున్నారు. ఈ మొత్తం డ్రామాకి తెరపడాలంటే రాజ్యసభ ఎన్నికల వరకు ఆగాల్సిందే.