TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్మాత దిల్‌రాజు కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Published on: Wed May 8, 2019 2:38PM

 

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు చెందిన ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మహర్షి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుండడంతో.. మహర్షి నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజుకు సంబంధించిన లావాదేవీలను ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా దిల్ రాజు నిర్మాతగా ఇటీవల విడుదలైన ఎఫ్2 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్ల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఐటీ సోదాలు నిర్వహించడంపై దిల్ రాజు స్పందిస్తూ.. ‘ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

మరోవైపు ‘మహర్షి’ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం కొనసాగుతోంది. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ఉత్వర్వులు ఇవ్వలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. థియేటర్ల యాజమాన్యాలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై కోర్టు వెళతామని మంత్రి చెప్పారు.
 
థియేటర్ల యాజమాన్యాలు మాత్రం.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకే తాము టికెట్ల ధరలు పెంచామని సమర్థించుకుంటున్నాయి. భారీ సినిమాలకు ధరలు పెంచడం సహజమేనని సినీ వర్గాలు కూడా అంటున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఫిల్మ్‌నగర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.