మాయావతికి షాకిచ్చిన ఐటీ అధికారులు !

 

బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతికి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. మాయవతి సోదరుడు, బీఎస్పీ నేత ఆనంద్ కుమార్, ఆయన భార్య లత పేరుపై ఉన్న రూ.400 కోట్లు విలువైన ఏడు ఎకరాల ప్లాట్ ను బినామీ ఆస్తుల చట్టం కింద జప్తు చేశారు. ఇటీల ఆనంద్ సింగ్ ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ మాయవతి నిర్ణయం తీసుకున్నారు. 

ఇది జరిగిన కొద్దిరోజులకే  ఆనంద్ సింగ్ పేరుపై యూపీలోని నొయిడాలో ఉన్న ఈ బినామీ ఆస్తిని ఐటీ శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) జప్తు చేస్తూ ప్రొవిజినల్ ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మోడీ ప్రభుత్వం తెచ్చిన బినామీ వ్యవహారాల నిరోధక చట్టం-2016 ప్రకారం బినామీ ఆస్తులు కలిగి ఉంటేవారికి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అలాగే ఆస్తి విలువలో 25 శాతం మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 

ఐటీ అధికారులు జప్తు చేసిన భూమి 28,328.07 చదరపు మీటర్లు ఉందనీ, ఈ ఆస్తి పుస్తక విలువే రూ.400 కోట్ల మేరకు ఉంటుందని ప్రస్తుత మార్కెట్ వాల్యూ దానికు మూడు రెట్ల దాకా ఉండచ్చని అంటున్నారు. ఆనంద్ కుమార్ తొలినాళ్లలో నోయిడా ఆథారిటీలో క్లర్కుగా పనిచేసేవారు. తదనంతర కాలంలో నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకేసారి 49 కంపెనీలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.1316 కోట్లకు చేరింది.