ఈరోజే చంద్రయాన్ 2...సర్వం సిద్దం !

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం మొన్న అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మళ్ళీ చంద్రయాన్ 2 ని ప్రయోగిస్తున్నారు. దీనికి నిర్దేశించిన 20 గంటల కౌంట్‌డౌన్ నిన్న సాయంత్రం ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 రాకెట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లనుంది. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి చంద్రయాన్‌-2‌ను పంపనున్నారు. జీఎస్ఎ‌ల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 

రాకెట్ బయలుదేరిన 16.13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం రాకెట్ నుంచి చంద్రయాన్‌-2 ఉపగ్రహం విడిపోతుంది. ఈ ప్రయోగాన్ని వారం క్రితం జులై 15న తెల్లవారుజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం గుర్తించి వాయిదా వేశారు. ఈ సమస్యను పరిష్కరించిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి సిద్ధం చేశారు. చంద్రయాన్-2 చంద్రుడిపై దిగిన తర్వాత అందులోని రోవర్‌ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను డీకోడ్ చేసి అందుకు సంబందించిన సమాచారాన్ని, చిత్రాలను పంపనుంది. ఈరోజు అయినా ఎటువంటి విజ్ఞాలు లేకుండా అది విజయవంతం అవ్వాలని కోరుకుందాం.