TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతరిక్షంలో ఇస్రో సరికొత్త ఆరంభం!

Published on: Tue Jun 6, 2017 11:22AM

 

ఇస్రో మరో ప్రయోగం చేసింది! మళ్లీ విజయవంతం అయింది! ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? అదీ నిజమే! ఇండియా, పాకిస్తాన్ పై క్రికెట్ మ్యాచ్ గెలవటం అంటే ఉత్కంఠ కాని… గెలవటం అలవాటుగా మార్చుకున్న ఇస్రో విషయంలో నో టెన్షన్స్! అలాంటి స్థితి చేరుకుంది మన అంతరిక్ష పరిశోధనా సంస్థ! అసలు ఒక్కో ప్రయోగం చేస్తూ ముందు ముందుకు చొచ్చుకుపోతున్న ఇస్రో ఇప్పుడు మరో దేశంతో పోటీ పడుతోందనటం పొరపాటే అవుతుంది! ఇస్రో తన మీద తానే గెలుస్తోంది! తన గత విజయం కన్నా అద్భుత విజయం ఈసారి సాధిస్తోంది! అంతకంటే గొప్ప విజయం కోసం మళ్లీ సిద్ధమవుతోంది! తాజాగా రోదసిలో ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ ఎంకే III  అలాంటి ఓ చారిత్రక విజయమే! ఇంకో విజయ యాత్రకి సన్నాహమే!

 

జూన్ 5న నింగికి ఎగిసిన జీఎస్ఎల్వీ ఎంకే III రాకెట్ గతంలో ఇస్రో ప్రయోగించిన రాకెట్స్ లాంటిది కాదు. అత్యంత భారీ ఉపగ్రహ వాహక నౌక ఇది! 640టన్నుల బరువున్న జీఎస్ఎల్వీ ఎంకే III 2వందల భారీ ఏనుగులతో సమానం! అయిదు జంబ్ జెట్ విమానాలతో సమానం! ఇక పొడవులో అయితే 13అంతస్థుల బంగాళ అంత వుంటుంది! అందుకే, ఈ చిన్న సైజు అంతరిక్ష భవనం ఇస్రో ప్రయోగించటం దేశానికే గర్వకారణం!

 

మాన్ స్టర్ రాకెట్ అని శాస్త్రవేత్తలు పిలిచే ఇస్రో బాహుబలి కేవలం 300కోట్లతో నిర్మించారు. ఇది ఇప్పుడు విజయవంతం కావటంతో ఇక మీదట భారత్ మూడు టన్నుల కంటే అధిక బరువుండే ఉపగ్రహాల్ని కూడా ప్రయోగించగలదు! ఇటువంటి ఘనత కలిగిన దేశాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే. అయితే, బాహుబలి రాకెట్ విజయవంతంలోని అసలు విశేషం భారీ ఉపగ్రహాలు ప్రయోగించటం మాత్రమే కాదు! ఈ సక్సెస్ తో ఇప్పుడు ఇస్రో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలదు!

 

అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపే ప్రయోగాల కోసం ఇస్రో 12500కోట్లు కేంద్రం నుంచి కోరింది. ఈ నిధులు మంజూరైతే రాబోయే ఏడేళ్లలో ఇస్రో భారతీయ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే వీలుంటుంది. అది మన అంతరిక్ష విజయాల చరిత్రలోనే అతి పెద్ద మైలురాయి అవ్వగలదు. అంతే కాదు, రానున్న రోజుల్లో అంతరిక్ష పర్యాటక రంగం కూడా కాసులు కురిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తునారు. అదే జరిగితే ఇస్రో డబ్బున్న వార్ని ఆకాశవీధీలోకి తీసుకెళ్లి లాభసాటి వ్యాపారం కూడా చేయగలదు!

 

టన్నుల కొద్దీ బరువుండే ఉపగ్రహాల్ని మోసుకెళ్లటం సుసాధ్యం చేసిన జీఎస్ఎల్వీ ఎంకే III వల్ల ముందు ముందు గురు గ్రహంపైకి, శుక్ర గ్రహంపైకి కూడా మనం వ్యోమనౌకల్ని పంపగలం! అలాగే, భూమి ఆవల వున్న కక్ష్యలోకి వ్యోమగాముల్ని పంపటం కూడా సుసాధ్యం అవుతుంది.అంతరిక్షంలో కాలుమోపనున్న తొలి భారతీయ వ్యోమగామిగా ఒక మహిళను పంపాలని ఇస్రో యోచిస్తోంది! మొత్తం మీద ఈ బాహుబలి రాకెట్ దేశ అంతరిక్ష ప్రస్థాన చరిత్రని కొత్త మలుపు తిప్పునుండటం మాత్రం గ్యారెంటీ!