ఆఫ్గాన్‌లో 30 మందిని కిడ్నాప్ చేసి..ఊచకోత కోసిన ఐఎస్

ఆఫ్గానిస్గాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవలే కాబూల్‌లో దాడికి పాల్పడి సుమారు 80 మంది ప్రాణాలు తీసిన ఐసిస్ ఉగ్రవాదులు తాజాగా మరో ఘటనకు పాల్పడ్డారు.  సెంట్రల్ ఆఫ్గనిస్థాన్‌లోని ప్రొవిన్షియల్ క్యాపిటల్ ఫిరోజ్ కోహ్ ప్రాంతానికి చెందిన సుమారు 30 మందిని అపహరించి వారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం నిన్న స్థానిక ఇస్లామిక్ స్టేట్ కమాండర్‌ను భద్రతా దళాలు అంతమొందించినందుకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. మృతుల్లో అధికమంది గొర్రెల కాపరులేనని చెప్పింది. ఉదయం గ్రామస్తులు అపహరించిన వారి మృతదేహలను గుర్తించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.